
పార్థీవ్ పటేల్ మరో ఘనత
మొహాలి:ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు ద్వారా ఎనిమిదేళ్ల తరువాత తిరిగి టెస్టు జట్టులో పునరాగమనం చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్... తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత తరపున టెస్టుల్లో 50మందిని పెవిలియన్ కు పంపిన భారత కీపర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. అంతకుముందు ఏడుగురు భారత కీపర్ల మాత్రమే టెస్టుల్లో 50 మందిని అవుట్ చేసిన క్లబ్లో చేరగా, ఆ ఘనత సాధించిన ఎనిమిదో కీపర్గా పార్థీవ్ నిలిచాడు. తన కెరీర్లో 21 టెస్టు మ్యాచ్ ఆడుతున్న పార్థీవ్.. అలెస్టర్ కుక్ క్యాచ్ పట్టి 50 అవుట్ల క్లబ్లో చేరాడు. ఆ తరువాత కాసేపటికి బెన్ స్టోక్స్ ను స్టంప్ చేశాడు. దాంతో దినేష్ కార్తీక్ 50 అవుట్ల మార్కును పార్థీవ్ అధిగమించాడు. ఈ టెస్టు మ్యాచ్కు ముందు పార్థీవ్ ఖాతాలో 41 క్యాచ్లు, 8 స్టంపింగ్స్ ఉన్నాయి.
ఎనిమిదేళ్ల తరువాత ఒక భారత ఆటగాడు టెస్టుల్లో పునరాగమనం చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ కు ముందు 2008లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టు మ్యాచ్లో పార్థీవ్ చివరిసారి ఆడాడు. భారత తరపున టెస్టుల్లో ఇంత సుదీర్ఘ కాలం తరువాత మరోసారి జట్టులో స్థానం సంపాదిండం ఇదే మొదటిసారి. అంతకుముందు భారత నుంచి ఆరు సంవత్సరాల తరువాత పునరాగమనం ఆటగాళ్లలో మొహిందర్ అమర్ నాథ్, విజయ్ మెహ్రాలు మాత్రమే ఉన్నారు.