హైదరాబాద్ హంటర్స్‌కు రెండో విజయం
బెంగళూరు బ్లాస్టర్స్‌పై 4–3తో గెలుపు
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో హైదరాబాద్ హంటర్స్ జోరు పెంచింది. శనివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో హంటర్స్ 4–3తో బెంగళూరు బ్లాస్టర్స్ జట్టుపై గెలిచింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. పురుషుల సింగిల్స్ తొలిమ్యాచ్‌లో సమీర్ వర్మ (హైదరాబాద్) 11–7, 11–8తో బూన్సక్ పొన్సానా (బెంగళూరు)పై గెలిచి హంటర్స్‌కు శుభారంభాన్నిచ్చాడు. అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో కరోలినా మారిన్–సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడీ 9–11, 7–11తో సిక్కిరెడ్డి–కో సంగ్ హ్యూన్ (బెంగళూరు) జంట చేతిలో ఓడింది. దీంతో స్కోరు 1–1తో సమమైంది. అనంతరం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోగా విక్టర్ అక్సెల్సన్ (బెంగళూరు) 11–6, 11–5తో భమిడిపాటి సాయిప్రణీత్ (హైదరాబాద్)పై గెలిచాడు. ఈ విజయంతో బ్లాస్టర్స్ ఆధిక్యం 3–1కు పెరిగింది.
పురుషుల డబుల్స్‌లో తన్ బూన్ హియోంగ్–తన్ వి కియోంగ్ (హైదరాబాద్) ద్వయం 5–11, 13–11, 11–8తో కో సంగ్ హ్యూన్–యూ సియంగ్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. దాంతో బెంగళూరు ఆధిక్యం 3–2కి తగ్గింది. అనంతరం మ్యాచ్ ఫలితాన్ని తేల్చే ‘ట్రంప్’ పోరులో హైదరాబాద్ ప్లేయర్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ 9–11, 11–5, 11–8తో అశ్విని పొన్నప్ప (బెంగళూరు)పై గెలిచింది. దాంతో హైదరాబాద్ 4–3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే పోటీల్లో ఢిల్లీ ఏసర్స్‌తో చెన్నై స్మాషర్స్, బెంగళూరు బ్లాస్టర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడతాయి.