ఎండలు బాబోయ్ ఎండలు
గత కొన్నేళ్లలో నిలకడగా యూఎస్ ఓపెన్‌కు వర్షం, తుఫాన్ అంతరాయం కలిగించాయి. ఫలితంగా నిర్వాహకులు రెండు ప్రధాన స్టేడియాలకు పైకప్పు నిర్మించడం మొదలుపెట్టారు. అయితే ఈసారి మాత్రం ఎండలు మండుతున్నాయి. ఎండ దెబ్బకు తాళలేక చాలామంది ఆటగాళ్లు మధ్యలోనే వైదొలుగుతున్నారు. ఈ విషయంలో గురువారం కొత్త రికార్డు నమోదైంది. తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లు మధ్యలోనే నిష్ర్కమించడంతో ఈ సంఖ్య 12కు చేరింది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ల చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో విభాగంలో ఎండకు తట్టుకోలేక 12 మంది వైదొలగడం ఇదే ప్రథమం.
33 డిగ్రీల వేడిలో... రూబెన్ బెమెల్‌మాన్స్ (బెల్జియం)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 22 ఏళ్ల జాక్ సోక్ (అమెరికా) 6-4, 6-4, 3-6, 1-2తో ఆధిక్యంలో ఉన్న దశలో కండరాలు పట్టేయడంతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే నిర్వాహకులు జాక్ సోక్‌కు ప్రథమ చికిత్స చేసి కోర్టు పక్కకు నీడలోకి తీసుకెళ్లారు. నీరసించిన సోక్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో జరిగిన మ్యాచ్‌లో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) 4-6, 4-6, 0-1తో వెనుకబడిన దశలో ఎండ వేడిమికి వైదొలిగాడు. సోమవారం టోర్నీ మొదలైన తొలి రోజు నుంచి ప్రతీరోజు 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తోంది.