యుద్ధభూమి కాదు.. క్రికెట్ స్టేడియం!
స్డేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీసులు, అనంతరం మ్యాచ్ లు ఆడటం చూస్తాంటాం. మరి క్రికెట్ స్టేడియంలో ఆర్మీ జవాన్లు ఎందుకున్నారు అని సందేహం వచ్చిందా? మీ అనుమానం నిజమే. క్రికెటర్లకు రక్షణ కల్పిస్తామన్న ధీమా కల్పించేందుకు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 1న ఉగ్రవాదులు, ఒక భారతీయ యువతి సహా 22 మందిని దారుణంగా గొంతులు కోసి చంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్-ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్ షెడ్యూల్ ఉంది.
ఉగ్రదాడులు జరిగిన ప్రాంతంలో మళ్లీ అదే తరహా దాడులు పునరావృతమవుతాయని ఇంగ్లండ్ ఆటగాళ్లు మొదట పలు సందేహాలు వ్యక్తంచేశారు. కానీ, చివరికి బంగ్లా ఆర్మీ సహాయం తీసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు రక్షణ కల్పిస్తామని బంగ్లా క్రికెట్ బోర్డు హామితో అంతా ఓకే అయింది. గత శనివారం జరిగిన మూడో వన్డేలో నెగ్గిన బంగ్లా 2-1 తేడాతో అఫ్ఘానిస్తాన్ పై కైవసం చేసుకున్న ఆనందంలో ఉండగా.. మరోవైపు పర్యాటక ఇంగ్లండ్ జట్టు మాత్రం కాస్త బెరుకుగా ఉంది.
ఈ నేపథ్యంలో బంగ్లా ఆర్మీ కమాండోల పర్యవేక్షణలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఢాకా లోని షేర్ ఏ బంగ్లా స్డేడియంలో ఈ జట్ల మధ్య శుక్రవారం రాత్రి తొలి వన్డే జరగనుంది. గతంలో పాకిస్తాన్ లో లంక ఆటగాళ్లపై దాడులు జరిగడంతో ఇప్పటివరకూ ఏ జట్టు పాక్ లో ఆడటానికి సముఖత చూపడం లేదన్న విషయం తెలిసిందే. బంగ్లా మాత్రం అలాంటి వాటికి తావివ్వకుండా తమ దేశంలో మ్యాచ్ లను నిర్వహించాలని ముందడుగు వేసింది.