న్యూ గినియా వచ్చేసింది | PNG Secured Their Place In Men's T20 World Cup In Australia | Sakshi
Sakshi News home page

న్యూ గినియా వచ్చేసింది

Oct 29 2019 4:07 AM | Updated on Oct 29 2019 4:07 AM

PNG Secured Their Place In Men's T20 World Cup In Australia - Sakshi

దుబాయ్‌: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్‌కు పపువా న్యూ గినియా  (పీఎన్‌జీ) అర్హత సాధించింది. ఆ జట్టు తొలిసారి ఐసీసీ టోర్నీకి ఎంపిక కావడం విశేషం. యూఏఈలో జరుగుతున్న క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా పపువా న్యూ గినియాకు ఆ అవకాశం దక్కింది. ఈ టోర్నీ లీగ్‌ దశ ముగిసేసరికి గినియా గ్రూప్‌ ‘ఎ’లో 6 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 54 పరుగులతో కెన్యాను ఓడించి గినియా ముందంజ వేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన గినియా 19.3 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 19 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా... నార్మన్‌ వనువా (48 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు.

ఆ తర్వాత కెన్యా 18.4 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు గ్రూప్‌ ‘బి’నుంచి కొంత అదృష్టం కలిసొచ్చి ఐర్లాండ్‌ కూడా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లో ఐర్లాండ్‌ 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో యూఈఏ చేతిలో ఐర్లాండ్‌ ఓడింది. ఫలితంగా ఐర్లాండ్‌తో పాటు ఒమన్, యూఏఈ కూడా తలా 8 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే రన్‌రేట్‌తో ఐర్లాండ్‌ ముందంజ వేసింది. ఐర్లాండ్‌ 2007లో జరిగిన తొలి ప్రపంచ కప్‌ మినహా మిగిలిన ఐదు టి20 వరల్డ్‌ కప్‌లలో కూడా ఆడింది.

నేటినుంచి ప్లే ఆఫ్‌లు... 
టి20 ప్రపంచ కప్‌ టోర్నీకి అర్హత సాధించేందుకు మొత్తం 6 జట్లకు అవకాశం ఉండగా ఇప్పటికే 2 జట్లు క్వాలిఫై అయ్యాయి. మరో 4 స్థానాల కోసం నేటినుంచి ఐపీఎల్‌ తరహాలో ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. రెండు గ్రూప్‌లలో 2, 3, 4 స్థానాల్లో నిలిచిన మొత్తం ఆరు జట్లు ఇందు కోసం పోటీ పడుతున్నాయి. నెదర్లాండ్స్‌–యూఏఈ, నమీబియా–ఒమన్‌ మధ్య మ్యాచ్‌లలో విజేతగా నిలిచే రెండు జట్లు ముందంజ వేస్తాయి. ఇక్కడ ఓడిన వాటిలో ఒక జట్టు స్కాట్లాండ్‌తో, మరో జట్టు హాంకాంగ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లలో గెలిచిన టీమ్‌లు వరల్డ్‌ కప్‌కు అర్హత సాధిస్తాయి.

పీఎన్‌జీ గురించి... 
పసిఫిక్‌ మహా సముద్రంలో ఆస్ట్రేలియాకు ఉత్తర భాగంలో ఉండే పపువా న్యూ గినియా ‘ఓషియానియా’ ఖండం పరిధిలోకి వస్తుంది. సమీప దేశం ఇండోనేసియా. బ్రిటన్‌ నుంచి 1975లో స్వాతంత్య్రం లభించింది. ఎక్కువ భాగం చిన్న చిన్న దీవులతో నిండిన దేశం. సుమారు 80 లక్షల జనాభా. ఇప్పటికీ దీవుల్లోని పెద్ద సంఖ్యలో ప్రజలు సాధారణ ప్రపంచానికి దూరంగా ఆటవిక జీవితాన్ని గడిపేవారే. తమ దేశంలో 851 రకాల భాషలు ఉన్నాయని పపువా న్యూ గినియా అధికారికంగా ప్రకటించుకుంది. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా నమోదయ్యే దేశాల జాబితాలో దీని పేరు తరచుగా ముందు వరుసలోనే వినిపిస్తుంది. పీఎన్‌జీలో రగ్బీ ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడ. గతంలో రెండు సార్లు (2013, 2015లలో) వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించేందుకు బాగా చేరువగా వచ్చి దానిని చేజార్చుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టు తమ గ్రూప్‌లో నెదర్లాండ్స్, నమీబియా, కెన్యా, బెర్ముడా, సింగపూర్‌లపై గెలిచి స్కాట్లాండ్‌ చేతిలో ఓడింది.cr

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement