ఫైనల్లో సెయింట్ జాన్స్ జట్లు
ఎఫ్‌సీఏ అండర్-16 క్రికెట్
సాక్షి, హైదరాబాద్: ప్రగూన్ దుబే (60 బంతుల్లో 73 నాటౌట్, 8 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో సెయింట్ జాన్స్ (గ్రీన్) జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీస్‌లో కూడా సెయింట్ జాన్స్‌కు చెందిన రెడ్ జట్టే గెలవడంతో టైటిల్ పోరు ఈ జట్ల మధ్య జరగనుంది. క్రికెట్ అకాడమీల సమాఖ్య (ఎఫ్‌సీఏ) అండర్-16 క్రికెట్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సెయింట్ జాన్స్ ఫౌండేషన్ జట్టు 8 వికెట్ల తేడాతో రాబిన్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌పై ఘనవిజయం సాధించింది.
మొదట రాబిన్ స్పోర్ట్స్ జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సయ్యద్ అఫ్జల్ (76) అర్ధసెంచరీ సాధించగా, ఫహీమ్ 35 పరుగులు చేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ జాన్స్ (గ్రీన్) జట్టు 22.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది.
ప్రగూన్‌తో పాటు అజయ్ దేవ్ గౌడ్ (47) రాణించాడు. రెండో సెమీఫైనల్లో సెయింట్ జాన్స్ (రెడ్) జట్టు 8 వికెట్ల తేడాతో ఎస్‌కేఎన్‌సీఏ జట్టుపై గెలిచింది. మొదట ఎస్‌కేఎన్ జట్టు 28.4 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. జైదేవ్ (62) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. సెయింట్ జాన్స్ బౌలర్లలో భగత్, మిఖిల్ జైస్వాల్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ జాన్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. భగత్ (51) బ్యాటింగ్‌లోనూ రాణించాడు.
రాణించిన ప్రగూన్
Published Wed, May 7 2014 12:37 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM