
చెన్నై: స్వదేశంలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. టాప్ సీడ్, భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ ముకుంద్ సెమీఫైనల్లో నిష్క్రమించారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ప్రజ్నేశ్ 4–6, 6–3, 0–6తో ఆండ్రూ హారిస్ (ఆస్ట్రేలియా) చేతిలో... శశికుమార్ ముకుంద్ 6–3, 4–6, 2–6తో రెండో సీడ్ కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు.
హారిస్‌తో 95 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. సెమీస్‌లో ఓడిన ప్రజ్నేశ్, శశికుమార్‌లకు 2,510 డాలర్ల చొప్పున (రూ. లక్షా 78 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 29 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.