ATP challenger tennis tournment
-
నాదల్కు మెద్వెదేవ్ షాక్
లండన్: తన కెరీర్లో లోటుగా ఉన్న టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో ఈసారీ నాదల్కు నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్కసారీ చాంపియన్‌గా నిలువలేకపోయిన 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నాదల్ సెమీఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 3–6, 7–6 (7/4), 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్)పై గెలిచి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. నాదల్‌తో గతంలో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన మెద్వెదేవ్ మొదటిసారి స్పెయిన్ స్టార్‌ను ఓడించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ థీమ్ (ఆస్ట్రియా)తో మెద్వెదేవ్ టైటిల్ కోసం తలపడతాడు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా తొలిసారి వారి ఖాతాలో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ చేరుతుంది. -
ప్రజ్నేశ్‌కు షాక్
చెన్నై: స్వదేశంలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. టాప్ సీడ్, భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ ముకుంద్ సెమీఫైనల్లో నిష్క్రమించారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ప్రజ్నేశ్ 4–6, 6–3, 0–6తో ఆండ్రూ హారిస్ (ఆస్ట్రేలియా) చేతిలో... శశికుమార్ ముకుంద్ 6–3, 4–6, 2–6తో రెండో సీడ్ కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. హారిస్‌తో 95 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. సెమీస్‌లో ఓడిన ప్రజ్నేశ్, శశికుమార్‌లకు 2,510 డాలర్ల చొప్పున (రూ. లక్షా 78 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 29 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పేస్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సాంటో డొమింగో ఓపెన్‌లో పేస్–వరేలా (మెక్సికో) జోడీ విజేతగా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ పేస్–వరేలా జంట 4–6, 6–3, 10–5తో బెహర్ (ఉరుగ్వే)–రొబెర్టో (ఈక్వెడార్) ద్వయంపై గెలిచి టైటిల్ సాధించింది. ఈ టైటిల్‌తో 110 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రూ. 5.70 లక్షల ప్రైజ్‌మనీ పేస్ ఖాతాలో చేరింది. 45 ఏళ్ల పేస్ వరేలాతో కలిసి గతవారం మాంట్రీ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. -
విష్ణు–బాలాజీ జంట ఓటమి
సాక్షి, హైదరాబాద్: సర్బిటాన్ ట్రోఫీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట నిష్క్రమించింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 4–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్ కెన్ స్కప్‌స్కీ–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో పరాజయం పాలైంది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు జోడీ ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్లో ఒకసారి సర్వీస్ చేజార్చుకున్న భారత జంట రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయింది. క్వార్టర్స్‌లో ఓడిన విష్ణు–బాలాజీ జంటకు 1,630 పౌండ్ల (రూ. లక్షా 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
లెక్సింగ్టన్ (అమెరికా): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్‌కప్ జట్టు ఆటగాడు సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తన భాగస్వామి దిమితార్ కుత్రోవ్స్కీ (బల్గేరియా)తో కలిసి సాకేత్ తొలి రౌండ్లో 7-5, 5-7, 10-7తో టాప్ సీడ్ జోడీ అలెక్స్ బోల్ట్-ఆండ్రూ విటింగ్టన్ (ఆస్ట్రేలియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం సాకేత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. ఏడో సీడ్ లియామ్ బ్రాడీ (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 2-6, 1-6తో ఓడిపోయాడు.మరోవైపు అట్లాంటా ఓపెన్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. జారెడ్ డొనాల్డ్సన్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 1-6, 6-3, 4-6తో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఉజ్బెకిస్థాన్‌లోని కర్షి పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 7-6 (7/4), 6-2తో యాంటెల్ వాండెర్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు 4 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఇక డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ మైనేని-జేమ్స్ క్లుస్కీ (ఐర్లాండ్) జోడి 7-6 (7/5), 6-3తో చేజ్ బుచానన్ (అమెరికా)-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంటపై గెలిచింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో నికొలజ్ బాసిలాష్విలి (జార్జియా)తో సాకేత్; డబుల్స్ సెమీఫైనల్లో సెర్గీ బెటోవ్-అలెగ్జాండర్ బురీ (బెలారస్) జోడితో సాకేత్-క్లుస్కీ ద్వయం పోటీపడుతుంది. -
ఫైనల్లో సాకేత్ జోడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్-సనమ్ జంట 6-3, 6-2తో నాలుగో సీడ్ అడ్రియన్ మెనాన్డెజ్ (స్పెయిన్)-నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్) ద్వయంపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో సంచాయ్ రాటివటానా-సొంచాట్ రాటివటానా (థాయ్‌లాండ్) జోడితో సాకేత్-సనమ్ తలపడతారు. మరో సెమీఫైనల్లో సంచాయ్-సొంచాట్ జోడి 3-6, 6-3, 10-7తో విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంటను ఓడించింది. సెమీస్‌లో సోమ్‌దేవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో సోమ్‌దేవ్ 6-2తో తొలి సెట్ గెల్చుకున్నాక... అతని ప్రత్యర్థి జె జాంగ్ (చైనా) భుజం నొప్పితో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో జె జాంగ్‌ను ఓడించిన సోమ్‌దేవ్ ఈసారి పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సోమ్‌దేవ్ 5-0తో ముందంజ వేశాడు. ఆ తర్వాత రెండు గేమ్‌లు కోల్పోయినా వెంటనే తేరుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అంకిత రైనా 3-6, 5-7తో యూలియా బెగెల్జిమర్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. -
పోరాడి ఓడిన సాకేత్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో ఆడిన భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ 6-7 (4/7), 6-7 (4/7)తో థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో పోరాడి ఓటమి పాలయ్యాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఇద్దరూ తమ సర్వీస్‌లను మూడేసిసార్లు కోల్పోయారు. అయితే నిర్ణాయక టైబ్రేక్‌లో మాత్రం సాకేత్ పైచేయి సాధించడంలో విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-2, 7-5తో సహచరుడు కరుణోదయ్ సింగ్‌ను ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. యూకీ బాంబ్రీ 6-2, 5-7, 5-7తో లూకాస్ పౌలీ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట 7-6 (7/4), 1-6, 10-4తో టాప్ సీడ్ దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడిని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సెమీస్‌లో సాకేత్, విష్ణు ద్వయాలు
కోల్‌కతా: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్‌లు తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-3, 6-3తో లుకాస్ పౌలీ (ఫ్రాన్స్)-గో సొయెదా (జపాన్) జోడిని ఓడించగా... విష్ణువర్ధన్-దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 6-3, 7-6 (7/4)తో సియెన్ యిన్ పెంగ్-సుంగ్ హువా యాంగ్ (చైనీస్ తైపీ) జోడిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... యూకీ బాంబ్రీ (భారత్) ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సోమ్‌దేవ్ 6-3, 6-3తో కుద్రయెత్సెవ్ (రష్యా)పై నెగ్గగా... యూకీ బాంబ్రీ 3-6, 4-6తో డాన్స్కాయ్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
యూకీ సంచలనం
చెన్నై : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో టాప్‌సీడ్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు యూకీ బాంబ్రీ షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఏడోసీడ్ యూకీ 6-2, 6-4 తేడాతో సోమ్దేవ్పై అలవోకగా విజయం సాధించాడు. ఫైనల్లో యూకీ, రష్యాకు చెందిన అన్‌సీడెడ్ అలెగ్జాండర్ కుద్రయవ్త్సేవ్తో తలపడనున్నాడు. సింగిల్స్‌లో సత్తా చాటిన యూకీ డబుల్స్‌లోనూ చెలరేగిపోయాడు. మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి డబుల్స్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూకీ-మైకేల్ జోడి 6-2, 6-1తో రూబెన్-ఆర్టెమ్పై అలవోకగా గెలిచింది. -
యూకీ xసోమ్‌దేవ్
చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్ బెర్తు కోసం భారత ఆటగాళ్ల మధ్యే పోటీ జరగనుంది. టాప్‌సీడ్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, ఏడో సీడ్ యూకీ బాంబ్రీలు సెమీఫైనల్లో ముఖాముఖి తలపడనున్నారు. గురువారం తనతో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన జోర్డీ మోంటానా (స్పెయిన్) కడుపునొప్పి కారణంగా పోటీ నుంచి వైదొలగడంతో సోమ్‌దేవ్‌కు వాకోవర్ లభించింది. కాగా, యూకీ 3-6, 6-2, 6-2తో లూయిస్ పౌలే (ఫ్రాన్స్)ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని ప్రస్థానం క్వార్టర్స్‌తో ముగిసింది. రష్యా ఆటగాడు అలెగ్జాండర్ కుద్రయెత్సెవ్ చేతిలో సాకేత్ 0-6, 2-6తో ఓటమిపాలయ్యాడు. మరో మ్యాచ్‌లో సనమ్‌సింగ్ 5-7, 4-6తో రెండో సీడ్ డాన్స్కాయ్ (రష్యా) చేతిలో ఓడాడు. మరోవైపు మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి యూకీ బాంబ్రీ డబుల్స్‌లోనూ సెమీస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో యూకీ-వీనస్ జోడి 6-2, 6-3తో థామస్ ఫాబియానో-అగస్టిన్ వెలోటి జంటపై గెలుపొందింది. బాలాజీ-బ్లాజ్ రోలా ద్వయం సెమీఫైనల్‌కు చేరింది. -
క్వార్టర్స్‌లో సాకేత్
చెన్నై : ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తెలుగుతేజం సాకేత్ మైనేని క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. బుధవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సాకేత్ 6-3, 6-2తో ఎనిమిదో సీడ్ థామస్ ఫాబియానో(ఇటలీ)పై అలవోకగా విజయం సాధించాడు. టాప్ సీడ్ సోమ్‌దేవ్, ఏడో సీడ్ యూకీ బాంబ్రీ కూడా క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. ప్రి క్వార్టర్స్‌లో సోమ్‌దేవ్ 6-7 (4/7), 6-0, 6-3తో న్యూజి లాండ్కు చెందిన మైకేన్ వీనస్‌పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ 6-2, 6-1తో జెరార్డ్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై అలవోకగా విజయం సాధించాడు. సనమ్ సింగ్ 6-1, 4-6, 7-6 (7/1)తో భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీపై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. డబుల్స్‌లో సోమ్‌దేవ్-ఇలిజా జోడి ప్రి క్వార్టర్స్‌లో ఓడిపోగా, యూకీ బాంబ్రీ-వీనస్ జోడి క్వార్టర్స్‌కు చేరింది. -
క్వార్టర్స్‌లో దివిజ్ జోడి
తాష్కెంట్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్-పురవ్ జంట 5-7, 6-3, 10-3తో ఆండ్రియా అర్నాబోల్డి-ఫాబియాన్ (ఇటలీ) ద్వయంపై విజయం సాధించింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మాలిక్ జజారీ (టర్కీ)-దస్తోవ్ (ఉజ్బెకిస్థాన్) జోడితో దివిజ్-పురవ్ తలపడతారు.