
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం టైటాన్స్, యూపీ యోధా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు చివరకు 26–26తో ‘డ్రా’గా ముగిసింది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్‌లో ఆ జోరు కనబర్చలేకపోయింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (3 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో టైటాన్స్ తొలి అర్ధభాగంలో 10–19తో వెనుకబడింది.
రెండో సగంలో ఇటు రైడింగ్‌లో, అటు ట్యాక్లింగ్‌లో అద్భుతంగా చెలరేగిన టైటాన్స్ చూస్తుండగానే మ్యాచ్‌పై పట్టు సాధించింది. నీలేశ్, మొహ్‌సిన్, అబోజర్ నాలుగేసి పాయింట్లు సాధించారు. యూపీ యోధా తరఫున సచిన్ కుమార్ 5, శ్రీకాంత్, రిశాంక్ దేవడిగ చెరో 4 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 38–32తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి