
ఇండోర్: తాను పొట్టి ఫార్మాట్‌కు సరిపోననే వాళ్లకు దీటైన సమాధానం చెప్పాడు చతేశ్వర్ పుజారా. టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన పుజారా టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను పక్కను పెట్టి బౌండరీలతో చెలరేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేవలం 61 బంతుల్లో అజేయ శతకం బాదేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
తొలి దశలో గ్రూప్-సిలో భాగంగా గురువారం రైల్వేస్, సౌరాష్ట్ర తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (34)తో కలిసి పుజారా ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 29 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (46; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి రెచ్చిపోయాడు. ఫలితంగా సౌరాష్ట్ర తరఫున టీ20 శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరొకవైపు ఫస్ట్‌క్లాస్ క‍్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ, లిస్-ఎ క్రికెట్‌లో 150కు పైగా స్కోరు, టీ20ల్లో సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా చేరిపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ మొదట ఈ రికార్డు అందుకున్నారు. ఇప్పుడు పుజారా వీరి సరసన చేరాడు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో పుజారా ప్రాతినిథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర ఓటమి పాలవ్వడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రైల్వేస్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment