ఫుజౌ (చైనా): అంతర్జాతీయస్థాయిలో స్టార్ ప్లేయర్ హోదా వచ్చాక... వారి ఆటతీరును ప్రత్యర్థులు ఎల్లవేళలా పరిశీలిస్తారని... లోపాలను గుర్తిస్తూ కొత్త వ్యూహాలు రచిస్తారని... అవకాశం రాగానే వాటిని అమలు చేసి అనుకున్న ఫలితం సాధిస్తారని... ప్రపంచ చాంపియన్, భారత మేటి షట్లర్ పీవీ సింధు కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలుస్తోంది. గత ఆగస్టులో విశ్వవిజేతగా అవతరించాక సింధుకు తన ప్రత్యర్థుల నుంచి మరింత గట్టిపోటీ ఎదురవుతోంది. దాని ఫలితమే ఆమెకు ఎదురవుతున్న వరుస పరాజయాలు. తాజాగా మంగళవారం మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆరో సీడ్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
ప్రపంచ 42వ ర్యాంకర్ పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో 74 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు 13–21, 21–18, 19–21తో ఓడిపోయింది. రెండు నెలల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లో పాయ్ యు పోపై అలవోకగా నెగ్గిన సింధు ఈసారి ఆమె చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో సింధు 18–15తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ వెంటనే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి 18–19తో వెనుకబడింది. ఆ తర్వాత స్కోరు సమం చేసినా... పాయ్ యు పో వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలిసారి సింధుపై విజయం సాధించింది. ఆగస్టులో విశ్వవిజేతగా నిలిచాక... సింధు పాల్గొన్న ఐదు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేదు. ఈ ఐదు పర్యాయాలు ఆమెను వేర్వేరు క్రీడాకారిణులు ఓడించడం గమనార్హం.
ప్రణయ్‌కు నిరాశ: పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ (భారత్) 17–21, 18–21తో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని (భారత్) 9–21, 8–21తో లి వెన్ మె–జెంగ్ యు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) 21–9, 21–15తో ఫిలిప్–రియాన్ (అమెరికా)లపై నెగ్గారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్–అశ్విని 21–19, 21–19తో హర్ల్‌బర్ట్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment