
మకాయ్ ఓపెన్ సెమీస్ లో పివి సింధు
మకాయ్: డిఫెండింగ్ చాంపియన్ పి.వి.సింధు మకాయ్ ఓపెన్ టోర్నీలో సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోచైనా క్రీడాకారిణి హాన్ లీ పై సింధు విజయం సాధించింది. ప్రపంచ 11 ర్యాంకర్ సింధు 21-17, 19-21, 21-16 తేడాతో ఐదో సీడ్ క్రీడాకారిణి అయిన హాన్ లీని బొల్తా కొట్టించింది.
తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న సింధు తదుపరి సెట్ ను కోల్పోయింది. అయితే మూడో సెట్ లో దూకుడుగా ఆడి జయకేతనం ఎగురవేసింది. ఇదిలా ఉండగా కెనడా క్రీడాకారిణి మిచెల్లీ లీ, థాయ్ లాండ్ క్రీడాకారిణి బుసానన్ ల మధ్య తదుపరి క్వార్టర్స్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజేతతో సింధు సెమీ ఫైనల్లో తలపడనుంది.