సింధు దూరం: సైనా సారథ్యం
మకావు: గతేడాది మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను సాధించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఒకే టోర్నమెంట్‌ను వరుసగా మూడుసార్లు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచిన స్టార్ షట్లర్ పివి సింధు.. ఈ ఏడాది ఆ టోర్నీ నుంచి వైదొలిగింది. ఇటీవల చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలవడమే కాకుండా, హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో రన్నరప్గా నిలిచిన సింధు..డిఫెండింగ్ చాంపియన్గా మకావు ఓపెన్లో ఆడాల్సి వుంది. కాగా, చివరి నిమిషంలో మకావు ఓపెన్ నుంచి తప్పుకుంది. వచ్చే నెల్లో దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సరికొత్త ప్రణాళికలతో సిద్ధమయ్యే క్రమంలోనే సింధు మకావు నుంచి వైదొలిగింది.
ఈ విషయాన్ని సింధు తండ్రి పివి రమణ స్పష్టం చేశారు.' ముందస్తు ప్రణాళిక ప్రకారం మకావు గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పాల్గొనాల్సి వుంది. కానీ దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సింధు అర్హత సాధించిన తరువాత ప్రణాళికను మార్చుకున్నాం. మకావు నుంచి తప్పుకుని దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సన్నద్ధం కావాలనే క్రమంలోనే సింధు తప్పుకుంది'అని వెంకట రమణ వివరణ ఇచ్చారు.
మకావు ఓపెన్లో సింధు తన తొలి మ్యాచ్ను బుధవారం చైనా క్రీడాకారిణి యు హెన్తో ఆడాల్సి వుంది.కాగా, ఆఖరి నిమిషంలో సింధు వైదొలగడంతో యు హెన్ బై ద్వారా రెండో రౌండ్లో అడుగుపెట్టనుంది.ఇదిలా ఉండగా, మకావు నుంచి సింధు వైదొలగడంతో మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ భారత్కు సారథ్యం వహించనుంది. 2014, 15, 16ల్లో మకావు ఓపెన్లో సింధు విజేతగా నిలిచింది.