కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్‌లో భారత్ కథ ముగిసింది. ఈరోజు(శుక్రవారం) జరిగిన మహిళల సింగిల్స్ పోరులో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు ఓటమి పాలయ్యారు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టడంతో భారత్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 16-21, 17-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చెందగా, సైనా నెహ్వాల్ 8-21, 7-21 తేడాతో మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చెందారు.
ఈ సీజన్ ఆరంభపు టోర్నీని ఘనంగా ఆరంభించాలని చూసిన సైనా నెహ్వాల్, పీవీ సింధులు క్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయారు. ఇది తై జు యింగ్ చేతిలో సింధుకు వరుసగా రెండో పరాజయం. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సింధును తై జు యింగ్ ఓడించారు. తై జు యింగ్ తాజా విజయంతో ముఖాముఖి రికార్డును 12-5 తేడాతో మరింత పెంచుకుంది. ఇక సైనా నెహ్వాల్ అరగంటలోనే చేతులెత్తేశారు.
Comments
Please login to add a commentAdd a comment