రెస్పెక్ట్: సన్మాన కార్యక్రమం సందర్భంగా సింధును ఆహ్వానిస్తున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ పతక విజేతలు పి.వి.సింధు, సాక్షి మలిక్‌లను ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రజతం నెగ్గిన సింధుకు రూ. 2 కోట్లు, కాంస్యం సాధించిన సాక్షికి రూ. కోటి నజరానాను అందజేశారు. వారిద్దరి కోచ్‌లు గోపీచంద్, మన్‌దీప్ సింగ్‌లకు రూ. 5 లక్షల చొప్పున, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానిక బాత్రా, అథ్లెట్ లలిత్ మాథూర్‌లకు రూ. 3 లక్షల చొప్పున బహూకరించారు. పతక విజేతల ఫిజియోలు సుబోధ్, కిరణ్‌లను కూడా సీఎం కేజ్రీవాల్ ఘనంగా సత్కరించారు. ‘ఇక్కడేం జరిగిందో తెలుసుకోడానికి రియోలో మా వద్ద ఫోన్లే లేవు.
కానీ వచ్చాకే తెలిసింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని... ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారని. ఇంతగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు’ అని సింధు తెలిపింది. బ్యాడ్మింటన్ ఆటలోని గేమ్ ప్లాన్, వ్యూహాలపై పుస్తకం రాస్తానని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు పాల్గొన్నారు.
‘ఫైనల్’ వీక్షకులు 1.72 కోట్లు
ముంబై: సింధు, మారిన్‌ల మధ్య రియోలో జరిగిన పసిడి పతక పోరును టీవీల్లో కోటి 72 లక్షల మంది వీక్షించినట్లు స్టార్ ఇండియా నెట్‌వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టార్ ఇండియా యాప్ ‘హాట్‌స్టార్’లో 50 లక్షల మంది ఈ మ్యాచ్‌ను చూశారని ఆ సంస్థ వెల్లడించింది. భారత్‌లో ఆ రోజు మొత్తం టీవీ కార్యక్రమాల్లో ఇదే అత్యధిక వీక్షణ రికార్డని స్టార్ స్పోర్‌ట్స సీఈఓ నితిన్ కుక్రేజా పేర్కొన్నారు. ఒక క్రికెటేతర ఆటను ఈ స్థారుులో వీక్షించడం కూడా ఇదే తొలిసారని ఆయన చెప్పారు.