సింధు కన్నీళ్లపర్యంతమైంది. అద్భుతమైన ఆటతీరు కనబర్చిన తర్వాత ఆనందంగా విజేతగా నిలవాల్సిన చోట చివరకు విషాదం మిగలడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన భావోద్వేగాలను దాచుకోలేక ఏడ్చేసింది. సరిగ్గా నాలుగు నెలల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా జపాన్ అమ్మాయి ఒకుహారా చేతిలో పోరాడి ఓడిన సింధు... ఈసారి మరో జపాన్ అమ్మాయి అకానె యామగుచికి తలవంచింది.
నాడు 110 నిమిషాల పోరులో ఓటమి చవిచూసిన ఈ తెలుగు తేజం... ఈసారి దాదాపు అదే తరహాలో సాగిన ఆటలో 94 నిమిషాల తర్వాత ఓటమిని అంగీకరించింది. సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సింధు రన్నరప్‌గానే వెనుదిరగాల్సి వచ్చింది. మ్యాచ్‌లో వెనుకబడినా కోలుకొని చెలరేగిన అకానె యామగుచి చాంపియన్‌గా అవతరించింది.
ఈ ఏడాది అద్భుతమైన ఆటతో రికార్డు స్థాయి విజయాలు సాధించిన పూసర్ల వెంకట (పీవీ) సింధు సీజన్ చివరి టోర్నీని ఘనంగా ముగించాలని భావించినా అది సాధ్యం కాలేదు. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ తుది పోరులో ఆమెకు పరాజయమే ఎదురైంది. ఈ టోర్నీ నాలుగు మ్యాచ్‌లలో చెలరేగి ఆడిన సింధు, ఫైనల్లోనూ తన దూకుడు ప్రదర్శించినా కీలక సమయంలో పాయింట్లు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–15, 12–21, 19–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. విజేత యామగుచికి 80 వేల డాలర్ల (రూ. 51 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీ... 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు; రన్నరప్ సింధుకు 40 వేల డాలర్ల (రూ. 25 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీ... 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
వెనుకబడినా...
గత మ్యాచ్‌లతో పోలిస్తే ఫైనల్లో సింధు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంది. దాంతో ఆమె పాయింట్లలో వెనకబడింది. 7–8 వద్ద ఉన్న దశలో చక్కటి రిటర్న్‌తో పాయింట్ రాబట్టి 8–8తో సమం చేసిన సింధు ఆ తర్వాత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. 5–7 వద్ద ఉన్న స్కోరునుంచి సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి ఏకంగా 13–8తో ముందంజలో నిలవడం విశేషం. ఆ తర్వాత యామగుచి పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. అయితే తిరుగులేని ఆటతో సింధు 14–13నుంచి స్కోరును 20–13 దాకా తీసుకెళ్లి అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది.
రివర్స్ అటాక్...
రెండో గేమ్ ఆరంభంలో సింధు 5–0తో ముందంజ వేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే యామగుచి ప్రతీ స్మాష్, రిటర్న్ విజయవంతం కాగా... సింధు స్మాష్‌లు నెట్‌పైకి వెళ్లడంతో జపాన్ అమ్మాయి వరుసగా ఐదు పాయింట్లు సాధించింది. ముందుగా 8–8తో స్కోరు సమం చేసిన అనంతరం 9–8తో ముందంజ వేసిన ఆమె దానిని నిలబెట్టుకుంది. ఈ గేమ్‌లో పాయింట్ల కోసం సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. కోర్టు బయటికి షటిల్‌ను కొట్టడం, రిటర్న్ చేయలేకపోవడం వంటి సింధు తప్పులు ప్రత్యర్థికి కలిసొచ్చాయి. అప్పటికే జోరు పెంచిన యామగుచి 16–12 స్కోరు నుంచి నేరుగా 21–12కు తీసుకెళ్లి గేమ్ గెలుచుకుంది.
అలసిన ఆటతో...
రెండో గేమ్ సమయంలోనే సింధు తీవ్రంగా అలసిపోయినట్లు కనిపించింది. మూడో గేమ్‌కు వచ్చేసరికి ఆమె ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఇక్కడా మొదట్లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లినా యామగుచి మళ్లీ కోలుకుంది. ఫలితంగా స్కోరు 5–5కు చేరింది. ఇక్కడి నుంచి నువ్వా, నేనా అన్నట్లుగా పోరు సాగింది. 10–8 వద్ద క్రాస్ కోర్టు స్మాష్‌తో పాయింట్ సాధించిన సింధు 11–8 వద్ద కాస్త విరామం తీసుకుంది. అయితే ఎక్కడా తగ్గని జపాన్ అమ్మాయి మళ్లీ స్కోరు 13–13 వద్దకు తీసుకురాగలిగింది. ఈ సమయంలో సాగిన ఒక అత్యద్భుత ర్యాలీ యామగుచికి పాయింట్ అందించింది.
మళ్లీ పోటీగా పాయింట్లు సాధించడంతో స్కోరు 18–18కు చేరుకొని మ్యాచ్‌లో మరింత ఉత్కంఠ పెరిగింది. మ్యాచ్‌లో అంతకుముందు ప్రతీసారి అవుట్‌ను చాలెంజ్ చేసి ప్రతికూల ఫలితం పొందిన సింధుకు ఈ సమయంలో మాత్రం ఒకసారి కలిసొచ్చింది. అటాకింగ్ స్మాష్‌తో ముందంజ వేసిన సిం«ధు ఆ తర్వాత రిటర్న్ చేయలేక పాయింట్ కోల్పోయింది. స్కోరు 19–19తో సమమై స్టేడియం మొత్తం సింధు పేరుతో నినాదాలు హోరెత్తుతున్న దశలో... వరుసగా రెండు సార్లు షటిల్‌ను నెట్‌పైకి ఆడి మ్యాచ్‌ను చేజార్చుకుంది. యామగుచి విజయానందం ప్రదర్శించగా... సింధు భారంగా కోర్టును వీడింది.
-దుబాయ్ నుంచి మొహమ్మద్ అబ్దుల్ హాది
చేరువై... దూరమై
Published Mon, Dec 18 2017 1:15 AM | Last Updated on Mon, Dec 18 2017 4:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment