విండీస్‌పై రహానే శతకం..
► హాఫ్ సెంచరీతో మెరిసిన ధావన్
ట్రినిడాడ్: భారత్- వెస్టిండీస్ రెండో వన్డేలో టీంఇండియా ఓపెనర్ అజింక్యా రహానే శతకం సాధించాడు. గత కొద్ది రోజులుగా నిలకడలేమి ఆటతో సతమతవుతున్న రహానే ఎట్టకేలకు శతకం బాది తన సత్తా చాటాడు. గత చాంపియన్స్ ట్రోఫీలో రహానే నిలకడలేమి ఆటతో బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా రహానే అర్ధశతకం సాధించాడు. కానీ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కూడా వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు మంచి శుభారంబాన్ని అందించారు. వీరి దూకుడుకు భారత్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఈ తరుణంలో 49 బంతుల్లో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం దూకుడుగా ఆడే ప్రయత్నంలో ధావన్(63) అష్లే నర్స్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రహానే 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత మరింత దూకుడు పెంచిన రహానే 102 బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లతో కెరీర్‌లో మూడో శతకం సాధించాడు. అనంతరమే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ ఫినీషర్ హర్డీక్ పాండ్యా(4) తీవ్రంగా నిరాశ పరిచాడు. మరో వైపు కెప్టెన్ కోహ్లీ(43), యువరాజ్ సింగ్(0) క్రీజులో ఉన్నారు. భారత్ 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.