
సచిన్ చివరి టెస్టులపై ద్రవిడ్ వ్యాఖ్య
పాతికేళ్ల అద్భుత కెరీర్ తర్వాత సచిన్ తన చివరి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు చేయకపోయినా అది పెద్ద విషయమే కాదని అతని మాజీ సహచరుడు రాహుల్ ద్రవిడ్ అభిప్రాయ పడ్డారు.
సచిన్ చివరి టెస్టులపై ద్రవిడ్ వ్యాఖ్య
ముంబై: పాతికేళ్ల అద్భుత కెరీర్ తర్వాత సచిన్ తన చివరి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు చేయకపోయినా అది పెద్ద విషయమే కాదని అతని మాజీ సహచరుడు రాహుల్ ద్రవిడ్ అభిప్రాయ పడ్డారు. అలాంటి దిగ్గజ ఆటగాడికి ప్రస్తుతం లభిస్తున్న స్థాయిలో వీడ్కోలు అవసరమేనని ద్రవిడ్ అన్నారు. ‘చివరి టెస్టుల్లో సచిన్ ఎన్ని పరుగులు చేస్తాడనే వాదనే అనవసరం. అతను కూడా దీని గురించి ఆలోచించకుండా సచిన్ తన ఆటను పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. 24 ఏళ్ల పాటు అతను భారత క్రికెట్ కోసం చేసిన సేవలకు నా తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ స్థాయిలో వీడ్కోలు పలికేందుకు మాస్టర్ అర్హుడు’ అని రాహుల్ చెప్పారు. అయితే 16 ఏళ్ల వయసునుంచి 40 ఏళ్ల వయసు వరకు అతని ఆట స్థాయి ఎక్కడా తగ్గలేదని, అదే తరహాలో మంచి స్కోర్లు సాధించి కెరీర్‌ను ముగించాలని కోరుకుంటున్నట్లు ఈ మాజీ బ్యాట్స్‌మన్ వెల్లడించారు.
ప్రస్తుత తరంలో ఎక్కువ కాలం వార్తల్లో నిలిచిన వ్యక్తి సచిన్ అని, అతని ఘనతలను చేరుకోవడం దాదాపు అసాధ్యమని ద్రవిడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సచిన్ చిన్నతనం నుంచే నేను అతనితో కలిసి క్రికెట్ ఆడాను. సుదీర్ఘ కాలం పాటు భారత్‌కు ఆడిన మాస్టర్ గణాంకాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా అతనెంత గొప్పవాడో చెబుతాయి. వాటిని పునరావృతం చేయడం చాలా కష్టం’ అని ఈ కర్ణాటక క్రికెటర్ కితాబిచ్చారు. సచిన్ రిటైర్ కాగానే అతని స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని, నిలకడగా రాణిస్తున్న కోహ్లితో పాటు అనేక మంది యువ ఆటగాళ్లు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని ద్రవిడ్ చెప్పారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటన తనకు ఆశ్చర్యం కలిగించలేదన్న ద్రవిడ్...మాస్టర్ ఆడిన 150కు పైగా ఇన్నింగ్స్‌లు, 100 సెంచరీలనుంచి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను ఎంచుకోవడం తనకు సాధ్యం కాదన్నారు.