ఇషాన్‌ తిరిగి రావాలంటే తనను తాను నిరూపించుకోవాలి: రాహుల్‌ ద్రవిడ్‌ | IND VS ENG 2nd Test: Rahul Dravid Said Ishan Kishan Needs To Start Playing To Be Considered For Selection | Sakshi
Sakshi News home page

ఇషాన్‌ మళ్లీ జట్టులోకి రావాలంటే తనను తాను నిరూపించుకోవాలి: రాహుల్‌ ద్రవిడ్‌

Published Mon, Feb 5 2024 9:13 PM | Last Updated on Mon, Feb 5 2024 9:21 PM

IND VS ENG 2nd Test: Rahul Dravid Said Ishan Kishan Needs To Start Playing To Be Considered For Selection - Sakshi

టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ గతకొద్ది రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాల చేత గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చేసిన ఇషాన్‌.. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. గ్యాప్‌ కావడంతో జాతీయ సెలెక్టర్లు సైతం ఇషాన్‌ను  ఏ ఫార్మాట్‌కు పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో అలకబూనాడో ఏమో తెలీదు కానీ.. అతను కనీసం దేశవాలీ టోర్నీల్లో కూడా ఆడకుండా బీష్మించుకు కూర్చున్నాడు. 

తాజాగా విశాఖ టెస్ట్‌ అనంతరం విలేకరులు ఇషాన్‌ గురించి టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వద్ద ఆరా తీశారు. అసలు ఇషాన్‌కు ఏమైంది.. అతను ఇంతకాలంగా జట్టుకు ఎందుకు దూరంగా ఉంటున్నాడంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ద్రవిడ్‌ స్పందిస్తూ.. ఇషాన్‌ను జాతీయ సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవాలంటే, అతను తొలుత క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాలి. ఏ తరహా గేమ్‌లోనైనా సరే తనను తాను నిరూపించుకోవాలి.

ఇషాన్‌ అభ్యర్ధన మేరకే బ్రేక్‌ లభించింది. తిరిగి జట్టులోకి రావాలంటే తప్పనిసరిగా ప్రూవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇషాన్‌తో టచ్‌లోనే ఉన్నామని ద్రవిడ్‌ వివరణ ఇచ్చాడు.

బీసీసీఐలోని ఓ వర్గం ఇషాన్‌ రీఎంట్రీని అడ్డుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న వేల ద్రవిడ్‌ ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. ఇషాన్‌ కూడా కోహ్లిలా బీసీసీఐ పెద్దలతో ఏదైనా గొడవ పడ్డాడా అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అప్పటివరకు మూడు ఫార్మాట్లలో సభ్యుడిగా ఉన్న ఇషాన్‌ ఒక్కసారిగా కనుమరుగైపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు.

ద్రవిడ్‌ ఇచ్చిన వివరణ చూస్తుంటే, ఇషాన్‌ రీఎంట్రీని అడ్డుకునే ప్రణాళికగా ఉందంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత టెస్ట్‌ వికెట్‌కీపర్‌ కేఎస్‌ భరత్‌ వరుసగా విఫలమవుతున్నా.. అతనితోనే నెట్టుకొస్తున్నారు కానీ, ఇషాన్‌ను అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ అనుమానులు వ్యక్తం చేస్తున్నారు.  

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్‌ (209), శుభ్‌మన్‌ గిల్‌ (104) అద్భుత ప్రదర్శనలతో చెలరేగడంతో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement