వర్షం కురిసింది... విండీస్ గట్టెక్కింది
డునెడిన్: అదృష్టమంటే ఇదేనేమో...! పరాజయం ఖాయమనుకున్న వేళ వరుణుడు కరుణ చూపడంతో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ‘డ్రా’తో గట్టెక్కింది. ఆట చివరి రోజు శనివారం 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీ విరామానికి 30 ఓవర్లలో నాలుగు వికెట్లకు 79 పరుగులు చేసి విజయం దిశగా పయనించింది. కివీస్ విజయానికి 33 పరుగుల దూరంలో ఉండగా భారీ వర్షం మొదలైంది. ఆ తర్వాత ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో చివరి సెషన్ ఆట సాధ్యపడలేదు. దాంతో కివీస్ ఆశలు ఆవిరయ్యాయి. వరుణుడు దయతో ఓటమి నుంచి గట్టెక్కిన వెస్టిండీస్ శిబిరం ఊపిరిపీల్చుకుంది.
అంతకుముందు వెస్టిండీస్ ఓవర్‌నైట్ స్కోరు 443/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించి 507 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రేవో (416 బంతుల్లో 31 ఫోర్లతో 218) ఓవర్‌నైట్ స్కోరుకు మరో 8 పరుగులు జోడించి అవుట్‌కాగా.... స్యామీ (145 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80) నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీ సాధించాడు. ఈ ఇద్దరి మధ్య ఏడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. కివీస్ బౌలర్లలో వాగ్నేర్ 3, సౌతీ, బౌల్ట్, సోధి తలా రెండేసి వికెట్లు తీశారు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను విండీస్ స్పిన్నర్ షిల్లింగ్‌ఫోర్డ్ (4/26) ఇబ్బందిపెట్టాడు. కివీస్ 44 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో రాస్ టేలర్ (16 నాటౌట్), అండర్సన్ (20 నాటౌట్) క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీ చేసిన రాస్ టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు వెల్లింగ్టన్‌లో ఈనెల 11న ప్రారంభమవుతుంది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్సింగ్స్: 609/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 213; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 507; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 79/4.