ముంబై: ఐపీఎల్ తాజా సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. రాజస్తాన్ రాయల్స్ విజయంలో మరోసారి జోస్ బట్లర్(94 నాటౌట్; 53 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా అజింక్యా రహానే(37) రాణించి విజయంలో భాగమయ్యాడు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సైతం రాజస్తాన్‌నే విజయం వరించిన సంగతి తెలిసిందే.
తాజా మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేజింగ్ చేసే క‍్రమంలో రాజస్తాన్ రాయల్స్ ఆదిలోనే డీఆర్సీ షార్ట్(4) నిరాశపరిచాడు. ఆ తరుణంలో బట్లర్-రహానేల జోడి ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను తీసుకుంది. ఈ జోడి 95 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రహానే రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై బట్లర్-సంజూ శాంసన్‌లు మూడో వికెట్‌కు 61 పరుగులు సాధించారు. ఇక చివర్లో బట్లర్ సిక్స్ కొట్టడంతో రాజస్తాన్ రాయల్స్ 18 ఓవర్లలో విజయం సాధించింది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్(38), ఎవిన్ లూయిస్(60), హార్దిక్ పాండ్యా(36; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment