‘ఇది మా హోమ్‌గ్రౌండ్. ఇక్కడ మేం చాలా మ్యాచ్‌లు ఆడాం. మ్యాచ్ గెలువడానికి సీక్రెట్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అందరూ ఉమ్మడిగా ఆడి గెలువాల్సిందే. అందరూ బాధ్యత తీసుకోవాల్సిందే’.. ఇవి రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా టాస్ ఓడిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్న మాటలు.
కానీ, చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో సొంతగడ్డ వాంఖడే స్టేడియంలో ముంబైకి పరాభవమే ఎదురైంది. వాంఖడే స్టేడియంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ 94 పరుగులు చేసి.. ముంబై ప్లేఆఫ్ ఆశలను కకావికలం చేశాడు. అతను ముంబై మాజీ ఆటగాడు కావడం గమనార్హం. అంతేకాదు, గతంలో ముంబై సభ్యుడిగా వాంఖడేలో ఆడిన అనుభవమే.. తన తాజా ఇన్నింగ్స్‌కు తోడ్పడిందని బట్లర్ చెప్పడం కొసమెరుపు.
నిజానికి ముంబై జట్టు ఈసారి మెరికల్లాంటి ఆటగాళ్లను కోల్పోయినందుకు చాలా బాధపడి ఉంటుంది. ఆ జట్టు వదులుకున్న అంబటి రాయుడు చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున మెరుపులు మెరిపిస్తున్నాడు. కీలక ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న రాయుడు అత్యధిక పరుగుల బ్యాట్స్‌మెన్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ముంబై వదులుకున్న మరో ఆటగాడు జోస్ బట్లర్.. వరుస అర్ధసెంచరీలతో రాజస్తాన్ రాయల్స్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని తెచ్చాడు. తాజా సీజన్‌లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించిన బట్లర్.. జట్టు ఫ్లేఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా నిలిపిన ఏకైక యోధుడిగా నిలిచాడు. తాజాగా ముంబైతో మ్యాచ్‌లో 54 బంతుల్లో 94 పరుగులు చేసి.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఓడటంతో ముంబై ఇండియన్స్ ఫ్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
వాంఖడే అనుభవమే..!
ముంబై విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని 12 బంతులు మిగిలి ఉండగానే రాజస్తాన్ జట్టు ఛేదించింది. మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో తాను ముంబై జట్టులో ఆడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గత అనుభవాలు తాను సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో తోడ్పడ్డాయని చెప్పాడు. ‘మంచి ఫామ్‌లో ఉండటంతో దానిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నా. డూ ఆర్ డై పరిస్థితుల్లో మేం ఉన్నాం. మిడిలార్డర్‌లో నేను ఎంతోకాలంగా బ్యాటింగ్ చేస్తున్నాను. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ముగిసే వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నా. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై జట్టును 15 పరుగుల వరకు కట్టడి చేశారు. మైదానం గురించి, వికెట్ గురించి తెలిసి ఉండటం కలిసొచ్చింది. తదుపరి మ్యాచ్‌లోనూ బాగా ఆడాలని అనుకుంటున్నా’ అని జోస్ బట్లర్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment