రాయల్స్ ‘హ్యాట్రిక్’
సమష్టిగా రాణించిన రాజస్థాన్ బౌలర్లు
నాయర్ అజేయ అర్ధసెంచరీ
7 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం
న్యూఢిల్లీ: చూడటానికి చిన్న జట్టే అయినా.. స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోయినా.. సమష్టి మంత్రంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్-7లో అదరగొడుతోంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. కరుణ్ నాయర్ (50 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శామ్సన్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచింది.
టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. డికాక్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (31 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్సర్), కేదార్ జాదవ్ (14 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. డుమిని, జాదవ్ ఐదో వికెట్‌కు 25 బంతుల్లో 46 పరుగులు జోడించారు. చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు రావడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఫాల్క్‌నర్, తాంబేలకు చెరో 2 వికెట్లు దక్కాయి.
రాజస్థాన్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. రహానే (12) విఫలమైనా... నాయర్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. శామ్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 51, బాటియా (17)తో కలిసి మూడో వికెట్‌కు 44, వాట్సన్ (16 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 41 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. నదీమ్, షమీ, పార్నెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
డికాక్ జోరు
ఢిల్లీ ఓపెనర్లలో డికాక్ ధాటిగా ఆడినా విజయ్ (13) విఫలమయ్యాడు. పీటర్సన్ (14) రెండు బౌండరీలతో టచ్‌లోకి వచ్చినా.. ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. నాలుగు బంతుల వ్యవధిలో తనతో పాటు డికాక్ కూడా వెనుదిరగడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడింది.
కార్తీక్ (12), డుమిని ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేయడంతో స్కోరు వేగం మందగించింది. చివరకు కార్తీక్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి బిన్నికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కేదార్ జాదవ్... ఫాల్క్‌నర్‌కు సిక్సర్ రుచి చూపించాడు. డుమిని కూడా కూడా చెలరేగడంతో పరుగులు వేగంగా వచ్చాయి. వీరిద్దరు ఐదో వికెట్‌కు 25 బంతుల్లో 46 పరుగులు జోడించారు.
నాయర్ నిలకడ
మూడో ఓవర్లోనే రహానే అవుటైనా.. శామ్సన్, నాయర్ నిలకడగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించాక శామ్సన్ అవుటయ్యాడు. ఉనాద్కట్ బౌలింగ్ సిక్సర్ కొట్టిన నాయర్ వేగంగా ఆడాడు. రాహుల్ శర్మ బంతిని బౌండరీ దాటించిన బాటియా ఉన్నంతసేపు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు ధాటిగా ఆడటంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది.
బాటియా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వాట్సన్ మొదట నెమ్మదిగా ఆడాడు. చేయాల్సిన పరుగులు పెద్దగా లేకపోవడంతో చెత్త బంతిని మాత్రమే బౌండరీ, సిక్సర్‌కు తరలించేందుకు ప్రయత్నించాడు. నాయర్, వాట్సన్ నిలకడతో రాజస్థాన్ మరో 9 బంతులు మిగిలుండగానే గెలిచింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) అండ్ (బి) తాంబే 42; విజయ్ (సి) వాట్సన్ (బి) ఫాల్క్‌నర్ 13; పీటర్సన్ (సి) స్మిత్ (బి) తాంబే 14; కార్తీక్ (సి) బిన్నీ (బి) ఫాల్క్‌నర్ 12; డుమిని (సి) బాటియా (బి) రిచర్డ్‌సన్ 39; కేదార్ జాదవ్ నాటౌట్ 28; పార్నెల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1-33; 2-69; 3-71; 4-95; 5-141
బౌలింగ్: బిన్నీ 1-0-9-0; రిచర్డ్‌సన్ 4-0-39-1; కులకర్ణి 3-0-18-0; వాట్సన్ 1-0-11-0; ఫాల్క్‌నర్ 4-0-26-2; తాంబే 4-0-25-2; బాటియా 3-0-21-0.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) విజయ్ (బి) పార్నెల్ 12; నాయర్ నాటౌట్ 73; శామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) నదీమ్ 34; బాటియా (బి) షమీ 17; వాట్సన్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1-20; 2-71; 3-115
బౌలింగ్: నదీమ్ 4-0-30-1; షమీ 4-0-22-1; పార్నెల్ 4-0-35-1; ఉనాద్కట్ 3.3-0-36-0 ; రాహుల్ శర్మ 3-0-32-0.