హెరాత్ మాయాజాలం
గాలె: స్పిన్నర్ రంగన హెరాత్ (4/79) రెండో ఇన్నింగ్స్‌లోనూ మ్యాజిక్ చూపెట్టడంతో వెస్టిండీస్‌తో నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 67/2తో శనివారం ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 68.3 ఓవర్లలో 227 పరుగులకే కుప్పకూలింది. బ్లాక్‌వుడ్ (135 బంతుల్లో 92; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా మిగతా వారు నిరాశపర్చారు.
కట్టుదిట్టమైన బంతులు వేసిన హెరాత్... ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బిషూ (10)తో పాటు శామ్యూల్స్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసి షాకిచ్చాడు. తర్వాత బ్లాక్‌వుడ్ నెమ్మదిగా ఆడినా... రెండో ఎండ్‌లో బ్రేవో (31), రామ్‌దిన్ (11)లు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో విండీస్ కోలుకోలేకపోయింది. 156/6 స్కోరుతో లంచ్ తర్వాత ఆట ప్రారంభించిన విండీస్ ఇన్నింగ్స్ గంటా 15 నిమిషాల్లోనే ముగిసింది. ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే 77 పరుగులు చేయాల్సిన దశలో హోల్డర్ (18), రోచ్ (5), టేలర్ (5)లు ఘోరంగా విఫలమయ్యారు.
మొండిగా పోరాడిన బ్లాక్‌వుడ్.. గాబ్రియెల్ (7 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు 38 పరుగులు జోడించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రసాద్, సిరివందనకు చెరో రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రంగన హెరాత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి కొలంబోలో జరుగుతుంది.