రంజీ ఫైనల్లో కర్ణాటక
112 పరుగులతో ముంబై చిత్తు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక తమ సత్తా ఏమిటో చూపుతూ మరోసారి రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్ పోరులో ముంబై జట్టును మరో రోజు ఆట మిగిలి ఉండగానే 112 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 445 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన మాజీ చాంపియన్ ముంబై... 121.1 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సిద్ధేష్ లాడ్ (143 బంతుల్లో 74; 8 ఫోర్లు; 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. పేసర్ అభిమన్యు మిథున్, లెగ్ స్పిన్నర్ గోపాల్ ముంబైని కట్టడి చేశారు. మొత్తం ఏడు వికెట్లతో జట్టు విజయంలో కీలకంగా నిలిచిన కెప్టెన్ ఆర్.వినయ్ కుమార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
గుగలే, ఖురానా సెంచరీలు
కోల్‌కతా: తమిళనాడుతో జరుగుతున్న రంజీ సెమీస్‌లో మహారాష్ట్ర దీటుగా బదులిస్తోంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ స్వప్నిల్ గుగలే (282 బంతుల్లో 154; 28 ఫోర్లు), చిరాగ్ ఖురానా (241 బంతుల్లో 125; 13 ఫోర్లు) అద్భుత సెంచరీలతో అదరగొట్టడంతో నాలుగో రోజు మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 394 పరుగులు చేసింది. మహారాష్ట్ర ఇంకా 155 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో అంకిత్ బావ్నే (95 బంతుల్లో 47 బ్యాటింగ్; 9 ఫోర్లు), మోత్వాని (4 బ్యాటింగ్) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం కష్టం కాబట్టి... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.