ప్రియాంక్ అజేయ శతకం
గుజరాత్ 283/3 ∙జార్ఖండ్‌తో రంజీ సెమీస్
నాగపూర్: ఆరున్నర దశాబ్దాల ‘ఫైనల్’ నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు తొలి రోజు శుభారంభం చేసింది. జార్ఖండ్ జట్టుతో ఆదివారం మొదలైన సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 283 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ పాంచాల్ (252 బంతుల్లో 144 బ్యాటింగ్; 21 ఫోర్లు) అజేయ శతకం సాధించగా... కెప్టెన్ పార్థివ్ పటేల్ (115 బంతుల్లో 62; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీ చేశాడు. ప్రియాంక్‌తో కలసి మన్‌ప్రీత్ జునేజా (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
తమిళనాడు 261/5
మరోవైపు రాజ్‌కోట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో మొదలైన మరో సెమీఫైనల్లో తమిళనాడు తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆరు వికెట్లకు 261 పరుగులు చేసింది. కౌశిక్ గాంధీ (50; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. విజయ్ శంకర్ (41 బ్యాటింగ్; 8 ఫోర్లు), అశ్విన్ క్రైస్ట్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, అభిషేక్ నాయర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.