
న్యూఢిల్లీ: 4 గ్రూపులు... 37 జట్లు... 50 మైదానాలు... 160 మ్యాచ్‌లు. దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. 2018–19 సీజన్‌కు నేటి నుంచి తెరలేవనుంది. 84 ఏళ్ల రంజీ చరిత్రలో ఇంత సుదీర్ఘ షెడ్యూల్, ఇన్ని జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి. 18 ఏళ్ల విరామం అనంతరం బిహార్ జట్టు తిరిగి దేశవాళీ బరిలో దిగనుండగా... మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, పుదుచ్చేరి జట్లు తొలిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న ఈ జట్లు సంప్రదాయ ఫార్మాట్‌లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. అయితే... ఆస్ట్రేలియా పర్యటనతో పాటు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు భారత్ ‘ఎ’ జట్లను ఇప్పటికే ప్రకటించడంతో... కొత్త కుర్రాళ్లు ఈ సీజన్‌లో సత్తాచాటినా వెనువెంటనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం లేదు. కానీ తమ ప్రదర్శనతో ఆకట్టుకొని సెలెక్టర్ల దృష్టిలో పడటానికి ఇది మంచి చాన్స్.
ఆంధ్ర, హైదరాబాద్ గ్రూప్ ‘బి’లో...
37 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’, ‘బి’ల్లో తొమ్మిదేసి జట్లు ఉండగా... గ్రూప్ ‘సి’లో పది జట్లు పాల్గొంటున్నాయి. ఇక కొత్తగా వచ్చిన జట్లు ప్లేట్ గ్రూప్‌లో బరిలో దిగనున్నాయి. ముంబై, కర్ణాటక, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, రైల్వేస్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, బరోడా, గుజరాత్‌లతో గ్రూప్ ‘ఎ’... ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు మధ్యప్రదేశ్‌లతో గ్రూప్ ‘బి’ పటిష్టంగా ఉన్నాయి. ‘ఎ’, ‘బి’గ్రూపుల నుంచి కలిపి అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఐదు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుతాయి. గ్రూప్ ‘సి’ నుంచి రెండు జట్లు, ప్లేట్ గ్రూప్ నుంచి ఓ జట్టు క్వార్టర్స్‌కు చేరతాయి. సీనియర్లు దూరం కావడంతో ఆయా జట్ల తరఫున కొత్త కుర్రాళ్లు బరిలో దిగనున్నారు. భారత్ ‘ఎ’ జట్టుకు ఎంపికవడంతో విహారి, సిరాజ్ లేకుండానే ఆంధ్ర, హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.
►రంజీ ట్రోఫీని ఇప్పటివరకూ ముంబై (బాంబే) అత్యధికంగా 41 సార్లు గెలుచుకుంది.
►హైదరాబాద్(vs)కేరళ (తిరువనంతపురంలో)
►ఆంధ్రప్రదేశ్(vs)పంజాబ్ (విశాఖపట్నంలో)