
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తి భారత్‌కు ఉందని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు. పరిస్థితులను అనుసరించి జట్టు కూర్పు నిర్ణయిస్తామని వెల్లడించాడు. ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పలు అంశాల గురించి మాట్లాడాడు. మెగా టోర్నీకి ఎంపికైన విజయ్ శంకర్ కీలకమైన నాలుగో స్థానంలో ఆడతాడా లేదా అనే ప్రశ్నకు పరోక్షంగా జవాబు చెప్పాడు. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల క్రికెటర్లు మన సొంతం. నాలుగో స్థానంలో ఆడగల బ్యాట్స్‌మెన్ చాలామంది ఉన్నారు.
ఇలాంటి అంశాలను ఎప్పుడో పరిశీలించాం. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదు. ఇంగ్లండ్ వెళ్లడానికి ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే ఇతరుల గురించి ఆలోచిస్తాం. అదృష్టవశాత్తూ కేదార్‌కు ఫ్రాక్చర్ కాలేదు. అతడిని కొన్ని రోజుల పాటు పరిశీలనలో ఉంచుతున్నాం. ఇంగ్లండ్ వెళ్లేందుకు ఇంకా సమయముంది. మరొకరి ఎంపికపై ఇప్పుడే ఆలోచించడం లేదు’ అని రవిశాస్త్రి అన్నాడు. జట్టు సన్నాహం గురించి మాట్లాడుతూ ‘ఇలాంటి మెగాటోర్నీలో ఏ జట్టూ ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్లలో ఇలాంటి పరిస్థితులెన్నో చూశాం. ఒత్తిడిని అనుభవించాం’ అని చెప్పాడు.