
‘నేను ఇప్పటికి 50 టెస్టులు మాత్రమే ఆడాను. ఇప్పుడు సాధించిన వికెట్ల సంఖ్యను భవిష్యత్తులో రెట్టింపు చేస్తాననే నమ్మకం ఉంది’... నాగ్‌పూర్ టెస్టులో 300 వికెట్ల మైలురాయిని చేరిన అనంతరం భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్య ఇది. కేవలం ఆరేళ్ల కాలంలో 54 టెస్టుల్లోనే 300 వికెట్లు పడగొట్టగలిగిన అశ్విన్ ఈ తరహాలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన తర్వాత అశ్విన్‌కంటే ఎక్కువ వికెట్లు ఎవరూ తీయలేకపోయారు. ఇంత చిన్న కెరీర్‌లోనే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 26 సార్లు పడగొట్టడం అశ్విన్ మినహా మరే బౌలర్‌కూ సాధ్యం కాలేదు. సచిన్, సెహ్వాగ్‌లకు కూడా సాధ్యం కాని రీతిలో ఏకంగా ఏడు సార్లు అతను ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఇప్పటి వరకు ఉన్న తన గణాంకాలు అశ్విన్‌కు ఏదీ అసాధ్యం కాదనే చెబుతున్నాయి. ముఖ్యంగా 2015, 2016, 2017లలో వరుసగా మూడేళ్ల పాటు అతను 50కు పైగా వికెట్లు తీయడం విశేషం.
అయితే అశ్విన్ కెరీర్‌లో రెండో కోణం చూస్తే గత మూడేళ్ల కాలంలో భారత్ సొంతగడ్డపై పెద్ద సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లు ఆడటం కూడా అతనికి కలిసొచ్చింది. భారత్‌లో 34 టెస్టుల్లోనే 216 వికెట్లు తీసిన అతను విదేశాల్లో 20 టెస్టుల్లో 84 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. 2018లో టీమిండియా పెద్ద సంఖ్యలో విదేశాల్లో టెస్టులు ఆడనుంది. ఇందులో ముందుగా దక్షిణాఫ్రికా పర్యటన, ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లు ఉన్నాయి. ఈ మూడు చోట్ల కలిపి అశ్విన్ ఆడింది 9 టెస్టులే. వీటిలో అతను 24 వికెట్లే తీయగలిగాడు. ఈ రికార్డును అతను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. పైగా విదేశీ గడ్డపై ఒకే స్పిన్నర్ అంటూ కెప్టెన్ కోహ్లి పరోక్షంగా చెబుతున్న నేపథ్యంలో ఆ ఒక్కడు కచ్చితంగా అతనే కావాలి. టెస్టుల్లో అందరికంటే వేగంగా ‘వికెట్ల ట్రిపుల్ సెంచరీ’ చేసిన ఈ చెన్నై ఇంజినీర్ తన ఆరేళ్ల ప్రస్థానంలో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. అయితే విదేశీ పర్యటనల తర్వాతే అతని కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. 2013లో దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్ టెస్టులో 42 ఓవర్లు బౌలింగ్ చేసి కూడా ఒక్క వికెట్ తీయలేకపోవడంతో అతను తుది జట్టులో చోటు కోల్పోయాడు.
భారత్ ఆడిన తర్వాతి తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింటిలో స్థానం దక్కనే లేదు. మిగిలిన రెండు మ్యాచ్‌లలో తీసింది 3 వికెట్లే! అంతే...అశ్విన్ కెరీర్ ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. అయితే అతను అధైర్యపడలేదు. పట్టుదలతో మళ్లీ స్థానం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. చిన్ననాటి కోచ్ మొదలు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వరకు అందరికీ తన సమస్య చెప్పుకున్నాడు. వారి సూచనలు, సలహాలతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకొని కొత్త అస్త్రాలతో అశ్విన్ సిద్ధమయ్యాడు. 2015లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు కొత్త అశ్విన్‌ను చూపించింది. ఆ మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన అశ్విన్ ఆ తర్వాత ఆగలేదు. కట్టల కొద్దీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ధాటికి సంగక్కర, ఆమ్లా, డివిలియర్స్, విలియమ్సన్, కుక్, రూట్, స్మిత్... ఒకరేమిటి, ఇలా ఎంతో మంది దిగ్గజాలు చేతులెత్తేసినవారే! స్పిన్‌కు ఏమాత్రం అనుకూలించని కోల్‌కతా పిచ్‌పై మౌనం వహించిన అశ్విన్, ఇప్పుడు నాగ్‌పూర్ టెస్టులో మళ్లీ సత్తా చాటాడు. ఇదే జోరు, ఫామ్ కొనసాగిస్తే మాత్రం తాను అభిమానించే అనిల్ కుంబ్లే వికెట్ల (619) సంఖ్యకు అశ్విన్ చేరువ కావడం అసాధ్యం కాకపోవచ్చు.
54 300 వికెట్లు పడగొట్టేందుకు అశ్విన్‌కు పట్టిన టెస్టులు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీ (56 టెస్టులు) పేరిట ఉన్న రికార్డును తిరగరాస్తూ అందరికంటే వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. సరిగ్గా లిల్లీ ఈ మైలురాయిని చేరిన రోజే (1981 నవంబర్ 27) అశ్విన్ కూడా అదే ఘనత సాధించడం విశేషం. అయితే ఇన్నింగ్స్‌లపరంగా చూస్తే అశ్విన్ (101) కంటే వేగంగా మురళీ ధరన్ (91) 300 వికెట్లు పడగొట్టాడు.
5 భారత్ తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఐదో బౌలర్ అశ్విన్. కుంబ్లే (619), కపిల్‌దేవ్ (434), హర్భజన్ సింగ్ (417), జహీర్ ఖాన్ (311) మాత్రమే అతనికంటే ముందున్నారు.
Comments
Please login to add a commentAdd a comment