విజయం ఊరిస్తోంది! | Ravindra Jadeja Leads India's Charge vs Australia | Sakshi
Sakshi News home page

విజయం ఊరిస్తోంది!

Published Mon, Mar 20 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

విజయం  ఊరిస్తోంది!

విజయం ఊరిస్తోంది!

గెలుపుపై కన్నేసిన భారత్‌
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 23/2
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 603/9 డిక్లేర్డ్‌
 పుజారా డబుల్‌ సెంచరీ, సాహా శతకం   


క్రీజ్‌లో నిలబడ్డ సమయం 672 నిమిషాలు... ఎదుర్కొన్న బంతులు 525... ఓపిక, ఏకాగ్రత, పట్టుదలకు కొత్త పాఠాలు నేర్పిస్తూ చతేశ్వర్‌ పుజారా ప్రదర్శించిన అమూల్యమైన ఆట ఇది. ప్రత్యర్థి బౌలర్లు బంతులు విసిరి విసిరి అలసిపోయి ఇక అవుట్‌ చేయడం మా వల్ల కాదన్నట్లుగా చేతులెత్తేసిన వేళ... పుజారా డబుల్‌ సెంచరీతో భారత్‌ను మరో చిరస్మరణీయ విజయం ముంగిట నిలిపాడు. స్కోరు సమం చేస్తే చాలనుకున్న స్థితి నుంచి ఆధిక్యం అలా అలా పెరుగుతూ పోయి మ్యాచ్‌ మన చేతుల్లోకి వచ్చే విధంగా రాచబాట వేశాడు. మరో ఎండ్‌ నుంచి వహ్వా అనిపించేలా ‘బుద్ధి’మాన్‌ సాహా శతకంతో ఇచ్చిన సహకారం కూడా రాంచీ టెస్టును అనూహ్య మలుపు తిప్పింది. వరుసగా రెండు సెషన్ల పాటు వికెట్‌ ఇవ్వకుండా వీరిద్దరు సాగించిన సున్నిత విధ్వంసానికి ఆసీస్‌ నిర్ఘాంతపోయింది.  

భారత్‌లో తొలి ఇన్నింగ్స్‌ స్కోరే కీలకం, 450 పరుగులు కూడా సరిపోవు అంటూ పదే పదే భయపడిన స్మిత్‌ మాటే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. సరిగ్గా మూడు నెలల క్రితం ముంబైలో ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిన ఫలితం ఇప్పుడు కంగారూలను కూడా వెంటాడుతున్నట్లుంది. ఆఖరి రోజు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్‌కు చిన్నపాటి లక్ష్యం విధించినా గెలుపుపై ఆశ పెంచుకోవచ్చు అని భావించిన ఆస్ట్రేలియాకు సీన్‌ రివర్సయింది. ఇప్పుడు తమ జట్టే అలాంటి పిచ్‌పై ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. జడేజా దెబ్బకు ఇప్పటికే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ రోజంతా నిలబడగల గడం ఆ జట్టు శక్తికి మించిన పని కావచ్చు!  

రాంచీ: నాలుగో రోజు అనూహ్య మలుపు తిరిగిన మూడో టెస్టులో భారత్‌ విజయంపై కన్నేసింది. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో అప్పుడే 2 ఆసీస్‌ వికెట్లను పడగొట్టేసింది. మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 23 పరుగులు చేసింది. వార్నర్‌ (14), లయన్‌ (2) అవుట్‌ కాగా, రెన్‌షా (7 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. చతేశ్వర్‌ పుజారా (525 బంతుల్లో 202; 21 ఫోర్లు) డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, వృద్ధిమాన్‌ సాహా (233 బంతుల్లో 117; 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌కు 4 వికెట్లు దక్కగా, 3 వికెట్లు తీసేందుకు ఒకీఫ్‌ ఏకంగా 77 ఓవర్లు బౌలింగ్‌ చేయడం విశేషం.

స్పిన్‌కు భీకరంగా స్పందిస్తున్న పిచ్‌పై ఆఖరి రోజు సోమవారం ఆసీస్‌ ముంగిట పెద్ద సవాల్‌ నిలిచింది. చివరి ఇన్నింగ్స్‌ ఆడుతున్నట్లయితే పరుగులతో పని లేకుండా కేవలం ‘డ్రా’ కోసం ప్రయత్నించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మూడో ఇన్నింగ్స్‌ కావడంతో ఆసీస్‌ ముందుగా భారత్‌ ఆధిక్యాన్ని అధిగమించాల్సి ఉంది. కాబట్టి వికెట్‌ కాపాడుకోవడమే కాకుండా పరుగులు కూడా చేయడం అవసరం. ఆపైన కూడా మరిన్ని పరుగులు చేసి భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించడం ఆ జట్టుకు దాదాపు అసాధ్యం కావచ్చు!

సెషన్‌–1: కలిసొచ్చిన అదృష్టం
నాలుగో రోజు ఆటలో రెండో ఓవర్‌ తొలి బంతికే భారత్‌ వికెట్‌ కోల్పోయేది. కమిన్స్‌ బౌలింగ్‌లో అంపైర్‌ సాహాను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు. అయితే రివ్యూ కోరిన భారత్‌ సానుకూల ఫలితం పొందింది. అనంతరం పుజారా, సాహా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరగా, భారత బ్యాట్స్‌మెన్‌ అంతే సంయమనంతో వాటిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ముందుగా పుజారా 150 పరుగుల మైలురాయిని చేరుకోగా, ఆ తర్వాత కొద్ది సేపటికి సాహా 100 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పుజారా 157 పరుగుల వద్ద ఉన్నప్పుడు లయన్‌ బౌలింగ్‌లో అంపైర్‌ ఎల్బీ ఇచ్చినా...రివ్యూలో పుజారా నాటౌట్‌ అని తేలింది. 51 పరుగుల వద్ద సాహా ఇచ్చిన క్యాచ్‌ను వేడ్‌ వదిలేయడంతో భారత కీపర్‌ బతికిపోయాడు. 59 పరుగుల వద్ద సాహా కీపర్‌ క్యాచ్‌ అవుట్‌ కోసం ఆస్ట్రేలియా రివ్యూ చేసినా ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. ఈ సెషన్‌లో పదో ఓవర్లోనే వాతావరణం మారిపోయి వెలుతురు మందగించడంతో ఫ్లడ్‌లైట్లను వెలిగించాల్సి వచ్చింది.
ఓవర్లు: 31, పరుగులు: 75, వికెట్లు: 0

సెషన్‌–2: కొనసాగిన జోరు
లంచ్‌ తర్వాత భారత జోడి తమ ధాటిని కొనసాగించింది. వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. ఆసీస్‌ బౌలర్లు కొన్ని సార్లు అద్భుతమైన బంతులు విసిరినా... వికెట్‌ తీయడానికి మాత్రం అవి సరిపోలేదు. ఆసీస్‌ స్కోరును అధిగమించిన అనంతరం పుజారా, సాహా వేగంగా దూసుకుపోయారు. 82 పరుగుల వద్ద కమిన్స్‌ విసిరిన బంతి సాహా ఛాతీని తాకుతూ వెళ్లగా స్లిప్‌లో స్మిత్‌ అందుకున్నాడు. అయితే చేతికి తాకిందని భావించి స్మిత్‌ రివ్యూ కోరగా మరోసారి అది వృథా ప్రయత్నమే అయింది.  
ఓవర్లు: 27, పరుగులు: 68, వికెట్లు: 0

సెషన్‌–3: జడేజా దూకుడు
విరామం అనంతరం తొలి బంతికే సింగిల్‌ తీసి 214 బంతుల్లో సాహా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే 521 బంతుల్లో పుజారా డబుల్‌ సెంచరీ కూడా పూర్తయింది. ఎట్టకేలకు వేగంగా స్కోరు పెంచే ప్రయత్నంలో షాట్‌ ఆడబోయి షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో పుజారా క్యాచ్‌ ఇవ్వగా... కొద్ది సేపటికే సాహా కూడా అదే తరహాలో అవుట్‌ కావడంతో ఆసీస్‌ కాస్త సేదతీరింది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వచ్చీ రాగానే దూకుడు ప్రదర్శించిన జడేజా తనదైన శైలిలో బౌండరీలు కొట్టాడు. లయన్, ఒకీఫ్‌ బౌలింగ్‌లో అతను ఒక్కో సిక్సర్‌ బాదాడు. తొమ్మిదో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం ఉమేశ్‌ (16) అవుటైనా... జడేజా అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాతే భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. నాలుగో రోజు కనీసం ఎనిమిది ఓవర్లు ఆడాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆసీస్‌ తడబడింది. అశ్విన్‌ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన వార్నర్‌ (14) ఆధిక్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అయితే జడేజా బౌలింగ్‌లో అతను క్లీన్‌బౌల్డయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే జడేజా నైట్‌వాచ్‌మన్‌ లయన్‌ (2)ను కూడా బౌల్డ్‌ చేయడంతో ఆట ముగిసింది.
ఓవర్లు: 22, పరుగులు: 100, వికెట్లు: 3 (భారత్‌)
ఓవర్లు: 7.2, పరుగులు: 23, వికెట్లు: 2 (ఆస్ట్రేలియా)


1 టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన భారత క్రికెటర్‌గా చతేశ్వర్‌ పుజారా (525 బంతులు) గుర్తింపు. రాహుల్‌ ద్రవిడ్‌ (495 బంతులు; పాకిస్తాన్‌పై 2004) పేరిట ఉన్న రికార్డు తెరమరుగు.

2 భారత గడ్డపై ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఓవర్లు వేసిన రెండో బౌలర్‌గా ఒకీఫ్‌ (77 ఓవర్లు) నిలిచాడు. హసీబ్‌ అహసాన్‌ (పాక్‌–84 ఓవర్లు; 1961లో) అగ్రస్థానంలో ఉన్నాడు.

6 ఆస్ట్రేలియాపై రెండు అంతకంటే ఎక్కువ డబుల్‌ సెంచరీలు చేసిన ఆరో బ్యాట్స్‌మన్‌ పుజారా. వ్యాలీ హామండ్‌ (6), బ్రియాన్‌ లారా (3), గ్రేమ్‌ పొలాక్, సచిన్‌ టెండూల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ (2) ఈ జాబితాలో ఉన్నారు.

53 ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్టులో 53 ఏళ్ల తర్వాత ఓ బ్యాట్స్‌మన్‌ 500 కంటే ఎక్కువ బంతులు ఆడాడు. చివరిసారి 1964లో కెన్‌ బారింగ్టన్‌ (ఇంగ్లండ్‌–624 బంతులు) ఈ ఘనత సాధించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement