
'సిక్స్'ర పిడుగు!
లేజీ ఆటగాడిగా ముద్ర పడిన రోహిత్శర్మ జూలు విధిలించాడు. క్రేజీ ఆటతో తన సత్తా ఏంటో కంగారూలకు రుచి చూపించాడు.
లేజీ ఆటగాడిగా ముద్ర పడిన రోహిత్శర్మ జూలు విధిలించాడు. క్రేజీ ఆటతో తన సత్తా ఏంటో కంగారూలకు రుచి చూపించాడు. సిక్సర్ల సునామీ సృష్టించాడు. 'డబుల్' వాయింపుతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విధ్వంసకర బ్యాటింగ్తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిరీస్ నెగ్గాలంటే గెలవాల్సిన మ్యాచ్లో వీ(హీ)రోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. రో'హిట్'తో 57 పరుగులతో ఆసీస్ను ఓడించి ధోని సేన 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ(209) సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 16 సిక్సర్లతో అతడీ ఘనత సాధించాడు. 15 సిక్సర్లతో షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా) పేరిట రికార్డును రోహిత్ తిరగరాశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ముగ్గురు భారత్ ఆటగాళ్లే కావడం విశేషం.
అంతేకాదు తానెంతో ఆరాధించే సచిన్ టెండూల్కర్ను రోహిత్ శర్మ అధిగమించడం విశేషం. వన్డేల్లో సచిన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 200 కాగా, రోహిత్ 209 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాట్స్మెన్గా అతడు నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్(219) రోహిత్ కంటే ముందున్నాడు.
విశేషమేమిటంటే సచిన్, రోహిత్ డబుల్ సెంచరీలకు కెప్టెన్ ధోని ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. ఈ ఇద్దరూ ద్విశతకాలు సాధించినప్పడు అదర్ ఇండ్లో 'లక్కీ' ధోని ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లోనూ చోటు దక్కించుకున్న రోహిత్ ఈ ఫార్మాట్లోనూ సత్తా చాటాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.