
మళ్లీ బరిలోకి చెన్నై, రాజస్థాన్
►వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోకి
►కొత్త జట్లు రావని ప్రకటించిన బీసీసీఐ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఇప్పుడున్న తరహాలోనే వచ్చే ఏడాదినుంచి కూడా ఎనిమిది జట్లే కొనసాగుతాయని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి వెల్లడించారు. 2017తో నిషేధం ముగుస్తున్న కారణంగా ఐపీఎల్–11నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తిరిగి లీగ్‌లోకి వస్తాయని ఆయన చెప్పారు. ఫలితంగా రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో ఉన్న పుణే సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ జట్లను తప్పిస్తామని జోహ్రి అన్నారు.
‘నిషేధం ముగిసిపోతోందని కాబట్టి ఆ రెండు జట్లు యథావిధిగా మళ్లీ వచ్చేస్తాయి. జట్ల సంఖ్యను పదికి పెంచాల్సిన అవసరం లేదని బీసీసీఐ భావిస్తోంది. కాబట్టి గుజరాత్, పుణే ఇక ముందు కొనసాగవు’ అని జోహ్రి స్పష్టతనిచ్చారు. ఈ ఏడాదితో ఐపీఎల్‌లో పది సీజన్లు ముగియడంతో వచ్చే సంవత్సరంనుంచి అందరు ఆటగాళ్లు అందుబాటులోకి వస్తారు. వేలంలో మళ్లీ ప్రతీ జట్టు కొత్తగా క్రికెటర్లను ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది.