ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచిన రాణీ రాంపాల్ | Rickshaw puller's daughter becomes queen of Indian hockey | Sakshi
Sakshi News home page

ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచిన రాణీ రాంపాల్

Published Wed, Aug 7 2013 1:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచిన రాణీ రాంపాల్

ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచిన రాణీ రాంపాల్

చాలా ఏళ్ల క్రితం... కూతురికి హాకీ క్రీడపై ఉన్న ఆసక్తిని గమనించిన ఓ తండ్రి ప్రోత్సహించాలని భావించాడు. అలాగే చేశాడు కూడా. అయితే అతడు అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. కారణం.. అతడు ఓ తోపుడు బండి లాగుతూ కుటుంబాన్ని పోషించుకునే నిరుపేద వ్యక్తి. ఇలాంటి దుర్భర నేపథ్యం నుంచి వచ్చిన ఓ అమ్మాయి మహిళల హాకీకి మహా‘రాణి’ కావాలని కన్న కల నెరవేరే అవకాశం ఉంటుందా..? అంకిత భావంతో ముందుకెళితే సాధ్యం కానిది ఉండదని నిరూపించింది... హర్యానాలోని షాబాద్‌కు చెందిన 18 ఏళ్ల రాణీ రాంపాల్.
 
 సాక్షి క్రీడావిభాగం
 అవటానికి జాతీయ క్రీడే అయినా... దేశంలో హాకీకి ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. క్రికెట్‌తో పోలిస్తే హాకీని అభిమానించే వారు చాలా తక్కువ. దీనికి తగ్గట్టుగానే హాకీలో భారత్‌కు చెప్పుకోదగ్గ విజయాలు రావడం లేదు. ఇక మహిళల విభాగంలో అయితే ఓ టైటిల్ గెలిచామని చెప్పుకుని చాలా కాలమైంది.
 
 ఈ నేపథ్యంలో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ జట్టు కాంస్యం సాధించడం పెద్ద సంచలనమైంది. ఈ టోర్నీలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రీడాకారిణి రాణీ రాంపాల్. ఈ హర్యానా అమ్మాయి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని... జీవితంలో అష్టకష్టాలు పడి కూడా ఆటపై మమకారాన్ని పెంచుకుంది. పట్టుదలతో రాణించి ఇవాళ మొత్తం దేశం చూపు తనవైపు తిప్పుకుంది. ప్రపంచకప్‌లో ఆరు గోల్స్ సాధించి ‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు గెలుచుకోవడంతో రాణీ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. దేశంలో హాకీ చచ్చిపోతుందనే వ్యాఖ్యలను ఆమె సగర్వంగా తిప్పికొడుతోంది. తమ ఈ విజయంతో అలాంటి అభిప్రాయం మార్చుకోవాలని సూచిస్తోంది.
 
 కష్టాలు.. కన్నీళ్లే
 రాణీ చిన్నప్పటి జీవితం సుఖవంతంగా గడిచింది లేదు. ఆటపై ఇష్టం పెంచుకున్నా నేర్చుకోవడానికి అది సరిపోదు.. బరిలోకి దిగాలంటే హాకీ స్టిక్స్, బూట్లు కావాలి. వాటిని కొనేందుకు తన తండ్రి దగ్గర డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితి వేరొకరికి ఎదురైతే పరిస్థితులతో రాజీపడేవారేమో.. కానీ రాణి అదృష్టం మరోలా ఉంది. ఆమెకు కోచ్, ద్రోణాచార్య అవార్డీ బల్దేవ్ సింగ్ అండగా నిలబడ్డారు. అవసరమైన క్రీడా పరికరాలు కొనిచ్చి ఆటలో రాటుదేలేలా చేశారు. కోచ్‌కు చెందిన షాబాద్ హాకీ అకాడమీలో ప్రాక్టీస్ చేసేందుకు తను రోజూ రెండు కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లేది. కొన్నిరోజుల తర్వాత తండ్రి ఓ సైకిల్ కొనిచ్చారు. చిన్నప్పుడు చాలా మంది హేళనగా మాట్లాడినా ఇప్పుడు తన విజయం ఎంతోమంది వర్థమాన ఆటగాళ్లకు ఆదర్శం కానుంది.
 
 13 ఏళ్లకే జట్టులో స్థానం
 టాలెంట్ ఎక్కడున్నా దాచిపెట్టడం కష్టమనే అభిప్రాయానికి తగ్గట్టుగానే రాణీ రాంపాల్ నైపుణ్యం త్వరగానే హాకీ పెద్దల దృష్టిని ఆకర్షించింది. 2008లో కజాన్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు 13 ఏళ్ల వయస్సులో రాణీ భారత సీనియర్ మహిళల జట్టులో స్థానం దక్కించుకుని రికార్డులకెక్కింది. అయితే ఆమె ప్రతిభ లోకానికి తెలిసింది మాత్రం ఆ తర్వాత ఏడాది జరిగిన చాంపియన్స్ చాలెంజ్-2 టోర్నీలోనే.
 
 అందులో అందరికన్నా ఎక్కువగా 8 గోల్స్ సాధించి ‘ఉత్తమ యువ క్రీడాకారిణి’గా నిలిచింది. ఇక గత ఆదివారం ప్రపంచ జూనియర్ మహిళల హాకీ టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ చేసిన మూడు గోల్స్‌లో రెండు రాణీనే సాధించింది. తద్వారా ఈ టోర్నీలో భారత్ తొలిసారిగా పతకం సాధించిన చరిత్రకు కారణమైంది. ఈ జట్టులో ఉన్న 16 మందిలో ఆరుగురు హర్యానాలోని షాబాద్‌కు చెందిన వారే కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement