
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్‌లో బుధవారం మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆట టీ విరామ సమయంలో అతడు ఆస్ట్రేలియాకే చెందిన మేటి బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ చేతుల మీదుగా హాల్ ఆఫ్ ఫేమ్ టోపీని అందుకున్నాడు. గత జూలైలో ఐర్లాండ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా రాహుల్ ద్రవిడ్ (భారత్), ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ క్లెయిర్ టేలర్, పాంటింగ్‌లను హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది.
ఈ మేరకు బుధవారం టోపీని స్వీకరించాడు. ‘ఈ అనుభూతిని వర్ణించలేను. మెల్‌బోర్న్ మైదానంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఈ గౌరవాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని 44 ఏళ్ల పాంటింగ్ అన్నాడు. ఆస్ట్రేలియా తరఫున పాంటింగ్ 168 టెస్టులు ఆడి 13,378 పరుగులు; 375 వన్డేలు ఆడి 13,704 పరుగులు సాధించాడు.