
ఒలింపిక్ విజేతకే షాక్ ఇచ్చేలా..
పారాలింపిక్స్ 1500మీ. పరుగులో బాకా రికార్డు
రియో డి జనీరో: ఒలింపిక్స్ విజేత నెలకొల్పిన రికార్డును ఓ పారాలింపిక్స్ అథ్లెట్ అధిగమించడమంటే మాటలా... వినడానికి నమ్మశక్యంగా లేని ఈ ఫీట్‌ను అల్జీరియాకు చెందిన అబ్దెల్లతిఫ్ బాకా సాధ్యం చేసి చూపించాడు. మంగళవారం జరిగిన టి13 1500మీ. ఫైనల్ పరుగును బాకా 3 నిమిషాల 48.29 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇది గత నెలలో జరిగిన ఒలింపిక్స్ 1500మీ. చాంపియన్ మాథ్యూ సెంట్రోవిట్జ్ (3నిమిషాల 50.00 సె) టైమింగ్‌కన్నా 1.7 సెకన్ల కన్నా తక్కువ కావడం విశేషం.
అంతేకాకుండా రజతం సాధించిన టమిరు డెమిస్సే (ఇథియోపియా, 3.48:49), కాంస్యం సాధించిన హెన్రీ కిర్వా (కెన్యా, 3.49:59), నాలుగో స్థానంలో నిలిచిన ఫోవద్ బాకా (అల్జీరియా, 3.49:84) కూడా ఈ ఒలింపిక్స్ చాంపియన్‌కన్నా వేగంగా పరిగెత్తి రేసు పూర్తి చేయడం నిజంగా అభినందనీయం.