
కోల్‌కతా: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఇచ్చిన అవకాశాలు చాలు అనేది ఒకవైపు విమర్శ అయితే, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనేది మరొకవైపు వాదన. పంత్‌ను పక్కన పెట్టమంటూ కొన్ని రోజుల క్రితం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సూచించగా, అతనిలో టాలెంట్ ఉంది.. కాస్త ఓపిక పట్టండి అని మరో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌కు అవకాశాలు ఇస్తున్నారు సరే కానీ టెస్టుల్లో కూడా అతను ఎందుకంటూ బెంగాల్ మాజీ కెప్టెన్ దీప్‌దాస్ గుప్తా ప్రశ్నించాడు.
‘ఇప్పటివరకూ పంత్ ఆటను పరిశీలిస్తే టెస్టుల్లో అతను ఎంతమాత్రం బెస్ట్ చాయిస్ కాదు. టెస్టు క్రికెట్ అనేది కాస్త భిన్నంగా ఉంటుంది. తన గత చివరి టెస్టు ఇన్నింగ్స్‌లో పంత్ అయోమయానికి గురైనట్లే కనబడింది. పంత్ టెస్టు ఆటగాడు కాదు. వృద్ధిమాన్ సాహాను టెస్టులకు ఎంపిక చేయాల్సింది. టెస్టుల్లో రిషభ్ కంటే సాహానే అత్యుత్తమం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత వరల్డ్‌లో ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడు. కాకపోతే అతను మంచి బ్యాట్స్‌మన్ కాదా.. అనేది ఇంకా టీమిండియా మేనేజ్‌మెంట్ సందేహం. ప్రధానంగా భారత జట్టు ఐదుగురి బౌలర్లతో మ్యాచ్‌కు సిద్ధమయ్యే క్రమంలో సాహా బ్యాటింగ్ సందేహాలు ఏర్పడుతున్నాయి. అతను ప్రతీసారి పరుగులు చేస్తూనే ఉన్నాడు. భారత్-ఏ తరఫున నిలకడగా పరుగులు చేసి తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు’ అని దీప్‌దాప్ గుప్తా పేర్కొన్నాడు.గత నెల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి టెస్టు ఆడిన పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. హోల్డర్ బౌలింగ్‌లో తడబాటుకు గురైన పంత్ బౌల్డ్‌గా నిష్క్రమించాడు.
Comments
Please login to add a commentAdd a comment