సాహా ఔట్‌.. రిషభ్‌ ఇన్‌ | Injured Saha Out From Field Pant Replaced | Sakshi
Sakshi News home page

సాహా ఔట్‌.. రిషభ్‌ ఇన్‌

Published Mon, Oct 21 2019 4:26 PM | Last Updated on Mon, Oct 21 2019 4:39 PM

Injured Saha Out From Field Pant Replaced - Sakshi

రాంచీ:  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ వేసిన 27 ఓవర్‌ తొలి బంతిని అందుకునే క్రమంలో సాహా వేలికి గాయమైంది. దాంతో బాధపడ్డ సాహాకు ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. ఆ బంతి సాహా వేలి పైభాగాన తగలడంతో నొప్పి ఎక్కువైంది. దాంతో  ఫిజియోతో కలిసి సాహా మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలోనే స్టాండ్‌ బై కీపర్‌గా ఉన్న రిషభ్‌ పంత్‌ను రమ్మంటూ కోహ్లి పిలిచాడు. ఉన్నపళంగా పంత్‌ గ్లౌవ్స్‌ ధరించి ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్‌ చేస్తున్న కీపర్‌కు సమస్య తలెత్తితే స్టాండ్‌ బైగా ఉన్న కీపర్‌ కీపింగ్‌ చేయవచ్చు. దాంతో సాహా స్థానంలో పంత్‌ కీపర్‌గా వచ్చాడు.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ జట్టులో సాహాతోపాటు పంత్‌ కూడా ప్రాబబుల్స్‌లో ఉన్నాడు. కాకపోతే ఇటీవల రిషభ్‌ పంత్‌ పేలవమైన ఆట కారణంగా సాహాను తొలి టెస్టు నుంచి కొనసాగిస్తూ వచ్చారు. తనకు వచ్చిన అవకాశాన్ని సాహా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో గాయపడటం ఆందోళన కల్గించింది. తప్పనిసరి పరిస్థితుల్లో సాహా మైదానాన్ని వీడటం.. పంత్‌ రావడం జరిగాయి. ఈ మ్యాచ్‌తో సిరీస్‌ ముగుస్తున్న తరుణంలో పంత్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. ఒకవేళ భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడి అప్పుడు కూడా సాహా రాకపోతే ఆ స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా పంత్‌ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా పరిస్థితిని చూస్తుంటే మరోసారి ఇన్నింగ్స్‌  తేడాతో ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అలా జరిగితే పంత్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాదు.  దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ ఆడుతూ 67 పరుగుల తేడాతో ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ ఆరు వికెట్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీశాడు.  ఇంకా దక్షిణాఫ్రికా 270 పరుగుల వెనుబడి ఉంది. ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ముందు ఈ పరుగులు సాధించాలి. ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉండటంతో టీమిండియా భారీ విజయం ఖాయంగా కనబడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement