రాజ్‌కోట్: మరొకసారి రంజీ ట్రోఫీ ఫైనల్లో బెంగాల్ జట్టు విఫలమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ముగిసిన తుది పోరులో సౌరాష్ట్ర విజయం సాధించింది. ఫలితంగా రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. డ్రాగా ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధారంగా సౌరాష్ట్ర విజేతగా అవతరించింది. అయితే బెంగాల్ జట్టు సభ్యుడైన వృద్ధిమాన్ సాహా మ్యాచ్ తర్వాత మాట్లాడాడు. రంజీ ట్రోఫీని బెంగాల్ ఎందుకు సాధించలేకపోయిందో వివరించాడు. ప్రధానంగా టాస్ ఓడిపోవడమే తాము టైటిల్‌ను కోల్పోవడానికి కారణమన్నాడు. ఆ పిచ్ చాలా పేలవంగా ఉందని, దాంతో బ్యాటింగ్ చేయడం కష్టతరమైందన్నాడు. (రంజీ చరిత్రలో సౌరాష్ట్ర నయా రికార్డు)
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎందుకు ఆడలేదు అనే దానిపై సాహా స్పందించాడు. ‘ ప్రతీ ఆటగాడికి తుది జట్టులో ఉన్నామా.. లేదా అనే విషయం మ్యాచ్‌కు ముందే తెలుస్తుంది. అది అప్పటి పరిస్థితిని బట్టి, బ్యాటింగ్ ఆర్డర్‌ను సెట్ చేస్తారు. నేను జట్టులో ఉన్నా చోటు దక్కలేదు. అదేమీ నన్ను బాధించలేదు. టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం మేరకు రిషభ్ పంత్‌కు అవకాశం దక్కింది. జట్టు పంత్ ఆడాలనే డిసైడ్ చేస్తే అతనే ఆడతాడు కదా.. అది నా చేతుల్లో ఉండదు. పంత్‌ను ఆడించాలనుకుంటే అతన్నే ఆడిస్తారు. ఇందులో విషయం ఏమీ లేదు. అది మేనేజ్‌మెంట నిర్ణయం. దాన్ని గౌరవించాలి. జట్టు కూర్పు అనేది మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది. మాలో ఎవరు ఆడిన మా లక్ష్యం మాత్రం జట్టు గెలుపులో భాగం కావడమే’ అని సాహా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment