న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రస్తుత కెరీర్ డైలమాలో పడింది. ఇటీవల కాలంలో పంత్ నిర్లక్ష్యంగా ఆడటంతో పాటు ఒకే తరహాలో ఔట్ కావడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు విసుగు తెప్పించడంతో పంత్‌ను పక్కన పెట్టేశారు. ఎంఎస్ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషభ్ పంత్ అని భావించినా అందుకు ఇప‍్పట్లో సమాధానం దొరికేలా కనబడటం లేదు. సఫారీలతో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పంత్‌ను ఆడించి చూద్దామని సెలక్టర్లు అనుకున్నప్పటికీ అందుకు కోహ్లి, రవిశాస్త్రిలు వద్దని చెప్పటం ఒకటైతే, ఇక్కడ మరొక వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వైపు మొగ్గుచూపారు. ఆ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఆడిన సాహా తాను ఏమిటో నిరూపించుకున్నాడు.
ఇప్పటివరకూ పంత్‌కు అండగా నిలిచిన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లిలు సైతం అతన్ని కొన్నేళ్లు పక్కన పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంత్ కెరీర్ ఏమిటనేది అతని అభిమానులకు మింగుడు పడటం లేదు. కాకపోతే రిషభ్ పంత్ తన భవిష్యత్తు అంటున్నాడు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్. ఇక్కడ అతనితో ఎవరికీ పోలిక తేలేమని సృష్టం చేశాడు. ప్రధానంగా సాహా-పంత్‌లను పోల్చవద్దని పేర్కొన్నాడు. ఈ ఇదరికీ పోలిక తేవడం ఎంతమాత్రం సరైనది కాదని అన్నాడు.
‘ రిషభ్ మా భవిష్యత్తు క్రికెటర్. మరి సాహా మా ప్రస్తుత క్రికెటర్. ఇద్దరూ అసాధారణ వికెట్ కీపర్లే. వారి వారి నైపుణ్యంతో జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. అటువంటప్పుడు ఇద్దరికీ పోలిక తేవడం మంచిది కాదు. విదేశీ పిచ్‌ల స్వభావాన్ని పంత్ తొందరగా అర్ధం చేసుకుంటున్నాడు. వెస్టిండీస్ పర్యటనే ఇందుకు ఉదాహరణ. భారత్-ఏ తరఫున విదేశీ పిచ్‌ల్లో ఆడిన అనుభవం పంత్‌కు ఉండటంతో అది అతనికి కలిసొచ్చింది. ఇక మేము భారత్‌లో మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు సాహా వైపు చూస్తున్నాం. అతను మా అత్యుత్తమ వికెట్ కీపర్. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అతని ప్రతిభ అంతా చూశాం. కాకపోతే వయసు రీత్యా పంత్ మా జట్టు భవిష్య ఆశా కిరణం అనుకుంటున్నాం’ అని శ్రీధర్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment