బెంగళూరు: మెరుపులతో పరుగుల వర్షం కురిసింది. 212 భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఉఫ్‌మని ఊదేసింది. ఇదీ తొలి టి20 ముచ్చట. రెండో టి20 సంగతికొస్తే... ప్రత్యర్థి బౌలర్ల హవాతో భారత్ మెరుపులు కుచించుకుపోయాయి. కానీ సఫారీ మాత్రం చకచకా ఛేదించేసింది. ఇలాంటి స్థితిలో మూడో మ్యాచ్ ‘మూడ్’ మార్చింది. భారత్ ఆల్‌రౌండ్ సత్తాను చూపించింది. నాలుగో మ్యాచ్ భారత్‌ను సిరీస్ రేసులోకి తెచ్చింది.
ఇక ఆఖరి పోరు రసవత్తరమే అనుకుంటే... హోరాహోరీ ఖాయమనుకుంటే... ఆటగాళ్ల పట్టుదలపై, అభిమానుల ఆశలపై, విజేత ఎవరనే అంచనాలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇక చాల్లే మీ ఆటలు... చూడండి నా చినుకులు... అని మైదానాన్ని నింపేశాడు. కాస్త తెరిపి నిచ్చి మొదలైన ఆటను మళ్లీ మొదటికే తెచ్చాడు. చివరకు మ్యాచ్‌ను ముంచాడు. 2–2తో సిరీస్‌ను పంచాడు. దక్షిణాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ బవుమా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా కాగా కేశవ్ మహరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
రాత్రి 9.37కు అర్థమైంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా కరచాలనం చేసుకుంటున్నారు. అంపైర్లు అక్కడే ఉన్నారు. ఇక ఆట సాగదనే ప్రకటన వెలువడటంతో ప్రేక్షకులంతా మైదానం వీడేందుకు కుర్చీల్లోంచి లేచారు. మెరుపుల్లేకుండా... సిరీస్ విజేతను చూడకుండా... అందరూ నిష్క్రమించడంతో ఆఖరి టి20 మ్యాచ్ రద్దయ్యిందని టీవీ ప్రేక్షకులకు కూడా ఆలస్యంగా అర్థమైంది. ఆఖరి మ్యాచ్ ముగిసిపోలేదు. వర్షంలో మునిగిపోయింది. సిరీస్ విజేతను తేల్చకుండా సమంగా ముగించింది.
వారాంతం సరదాగా గార్డెన్ సిటీలో ఎంతో ఆశగా మ్యాచ్‌ను, విజేతను చూద్దామనుకుంటే చివరకు తడిసిపోవడమే జరిగింది. ఆదివారం జరిగిన ఐదో టి20 మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. కుండపోతగా కురిసిన చినుకులతో మైదానం చిత్తడిగా మారింది. రాత్రి పది అవుతున్నా వరుణుడు ‘తగ్గేదేలే’ అనడంతో అంపైర్లు ఇక ‘చేసేదేలే’ అని ఆటను రద్దు చేశారు. అప్పటిదాకా కనీసం ఐదు ఓవర్ల చొప్పున నిర్వహించాలని చూసినా తెరిపినివ్వని వానతో ఏ మూలనో ఉన్న ఆఖరి ఆశ కూడా ఆవిరైంది.
అంతకుముందు ఆలస్యంగా మొదలై కాసిన్ని ఓవర్లు జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ మళ్లీ వర్షంతో ఆట నిలిచే సమయానికి 3.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (7 బంతుల్లో 15; 2 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్‌లను (12 బంతుల్లో 10; 1 ఫోర్) ఇన్‌గిడి పెవిలియన్ పంపాడు. శ్రేయస్ అయ్యర్ (0 నాటౌట్)తో జతకలిసిన కెప్టెన్ పంత్ (1 నాటౌట్) ఒక బంతి ఆడాడు. అప్పటికే పడు తున్న చినుకులు పెద్ద వానగా మారడంతో అంతా మళ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లకు అడుగులేశారు. భారత బౌలర్ భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment