Ind Vs SA 5th T20: Rishabh Pant Says To Critics You Decide About My Captaincy And Performance - Sakshi
Sakshi News home page

Rishabh Pant: ఆటగాడిగా, కెప్టెన్‌గా వందకు వంద శాతం.. ఏదేమైనా: పంత్‌ కౌంటర్‌!

Published Mon, Jun 20 2022 11:11 AM | Last Updated on Mon, Jun 20 2022 2:34 PM

Ind Vs SA 5th T20 No Result: Rishabh Pant Says You Guys Decide On Critics - Sakshi

టీ20 సిరీస్‌ ట్రోఫీతో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌, టీమిండియా తాత్కాలిక సారథి రిషభ్‌ పంత్‌(PC: BCCI)

Ind Vs SA 5th T20- Rishabh Pant: ఆటగాడిగా, కెప్టెన్‌గా వందకు వంద శాతం న్యాయం చేసేందుకు తాను కృషి చేస్తానని, అంతే తప్ప ఎవరు ఏమనుకుంటున్నారో పట్టించుకోనని టీమిండియా తాత్కాలిక సారథి రిషభ్‌ పంత్‌ అన్నాడు. రోజురోజుకు ఆటను మెరుగుపరచుకోవడంపైన మాత్రమే దృష్టి సారిస్తానంటూ విమర్శకులను ఉద్దేశించి కౌంటర్‌ ఇచ్చాడు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ గాయపడిన నేపథ్యంలో రిషభ్‌ పంత్‌ భారత జట్టు పగ్గాలు చేపట్టాడు.

అయితే, మొదటి రెండు టీ20 మ్యాచ్‌లలో సారథి పంత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. బ్యాటర్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో 29 పరుగులు, రెండో మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో షాట్‌ సెలక్షన్‌ విషయంలో పంత్‌ మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నువ్వు తాత్కాలిక సారథివి మాత్రమే బ్యాటర్‌గా ఇంకా సాధించాల్సి ఉందంటూ మాజీ ఆటగాళ్లు చురకలు అంటించారు కూడా.

ఈ క్రమంలో తదుపరి రెండు టీ20లు గెలవడంతో పంత్‌ సేన ప్రొటిస్‌తో సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ‍అయితే, పంత్‌ బ్యాటర్‌గా మరోసారి విఫలమైనా(వరుసగా 6, 17 పరుగులు) కెప్టెన్‌గా మాత్రం విజయవంతమయ్యాడు. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా నిర్ణయాత్మక ఐదో టీ20 మొదలైన తర్వాత వర్షం కారణంగా రద్దు కావడంతో ఫలితం తేలలేదు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రిషభ్‌ పంత్‌ మాట్లాడుతూ.. ‘‘ ఈ సిరీస్‌లో చాలా సానుకూలా అంశాలు ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్‌లు ఓడి 0-2తో వెనుకబడిన వేళ.. పట్టుదలతో గెలిచి నిలిచిన తీరు అమోఘం. ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా పూర్తి న్యాయం చేసేందుకే ఎల్లవేళలా కృషి చేస్తా.

ఇక నా ఆట తీరును, సారథిగా నా వ్యూహాలు ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి మరి! నా దృష్టి అయితే కేవలం ఆట మీదే! అది మైదానంలోనైనా లేదంటే మైదానం వెలుపలైనా!’’ అంటూ తనను విమర్శిస్తున్న వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఇక ఈ సిరీస్‌లో చాలాసార్లు టాస్‌ ఓడిపోయానన్న పంత్‌.. ఆ విషయం తన ఆధీనంలో ఉండదంటూ ఫలితాలపై అది కూడా ప్రభావం చూపుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తమ దృష్టి మొత్తం ఇంగ్లండ్‌తో టెస్టు ఆడటం మీదే ఉందని, అక్కడ బ్యాటర్‌గా తన సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతానని పంత్‌ చెప్పుకొచ్చాడు. 

చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement