
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 90 బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. షకీబుల్ హసన్ వేసిన 29 ఓవర్ ఆరో బంతిని సింగిల్ తీయడం ద్వారా రోహిత్ సెంచరీ నమోదు చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలో రోహిత్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇది రోహిత్‌కు 26వ వన్డే సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో 4 సెంచరీ. కాగా, ఒక వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ రోహిత్ చేసిన పరుగులు 544.
గతంలో భారత్ తరఫున ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో జాబితాలో సచిన్ టెండూల్కర్(673) తొలి స్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ ఈ ఫీట్ సాధించాడు. తాజాగా ఆ తర్వాత స్థానాన్ని రోహిత్ ఆక్రమించాడు. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో ఆటగాడు కూడా రోహిత్ కావడం మరో విశేషం. మరొకవైపు ఈ వరల్డ్‌కప్‌లో టాప్ ప్లేస్‌ను ఆక్రమించాడు రోహిత్. ఈ క్రమంలోనే ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(516)ను వెనక్కినెట్టాడు.
మరొకవైపు వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ నాల్గో స్థానానికి చేరాడు. ప్రస్తుతం రోహిత్ 230 వన్డే సిక్సర్లు సాధించాడు. ఇక భారత్ తరఫున అత్యధిక వన్డే సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోని(228 సిక్సర్లు)ని అధిగమించాడు రోహిత్. ఇదిలా ఉంచితే తొలి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత రోహిత్ ఔటయ్యాడు. ఇది వరల్డ్‌కప్‌లో భారత్‌కు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. అంతకముందు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు 174 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించారు. 2015 వరల్డ్‌కప్‌లో ధావన్‌తో కలిసి రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు అదే రోహిత్.. రాహుల్‌తో కలిసి దాన్ని బ్రేక్ చేశాడు.