బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 315 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. రోహిత్ శర్మ(104; 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్(77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక రిషభ్ పంత్(48; 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకం సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. చివర్లో ఎంఎస్ ధోని(35; 33 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త ఫర్వాలేదనిపించాడు.( ఇక్కడ చదవండి: రోహిత్ క్యాచ్ వదిలిస్తే.. అంతే!)
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్-కేఎల్ రాహుల్‌లు ఘనంగా ఆరంభించారు. బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఈ క్రమంలోనే రోహిత్ సెంచరీ సాధించాడు. శతకం సాధించిన రోహిత్ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిటాన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. కాగా, మరో 15 పరుగుల వ్యవధిలో రాహుల్ కూడా ఔట్ కావడంతో 195 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కోహ్లి-రిషభ్ పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ జోడి 42 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి(26) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, వెంటనే హార్దిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. అయితే రిషభ్ పంత్ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.
(ఇక్కడ చదవండి: రోహిత్ ‘వెయ్యి’ కొట్టేశాడు..!)
ఒక భారీ షాట్‌కు యత్నించిన రిషభ్.. వరల్డ్‌కప్‌లో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని రెండు పరుగుల వ్యవధిలో జార విడుచుకున్నాడు. దినేశ్ కార్తీక్(8) సైతం నిరాశపరచగా, ధోని క్రీజ్‌లో నిలిచి భారత్ స్కోరును మూడొందలు దాటించాడు. ముస్తాఫిజుర్ వేసిన చివరి ఓవర్ మూడో బంతికి ధోని ఔట్ కాగా, ఐదో బంతికి భువనేశ్వర్ రనౌట్ అయ్యాడు. ఇక చివరి బంతికి మహ్మద్ షమీ బౌల్డ్ కావడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ ఐదు వికెట్లతో రాణించగా, షకీబుల్ హసన్, సౌమ్య సర్కార్, రూబెల్ హుస్సేన్ తలో వికెట్ తీశారు. ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా... బంగ్లా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment