బంగ్లాను మట్టికరిపించి.. సెమీస్‌కు సగర్వంగా | Team India Beat Bangladesh By 28 Runs Qualify Semis | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌: సెమీస్‌కు భారత్‌

Published Tue, Jul 2 2019 11:21 PM | Last Updated on Tue, Jul 2 2019 11:58 PM

Team India Beat Bangladesh By 28 Runs Qualify Semis - Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. దీంతో సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా కోహ్లి సేన నిలిచింది. తాజా ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సెమీస్‌కు చేరిన తొలి ఆసియా జట్టుగా భారత్‌ ఘనతను అందుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో భారత్‌ జయభేరి మోగించింది. ఈ ఓటమితో బంగ్లా సెమీస్‌ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. 

ఇక పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో బంగ్లా అద్భుతంగా పోరాడింది. ఓ దశలో విజయం వైపు పయనించింది. అయితే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బంగ్లా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో శతకం సాధించి టీమిండియాకు మంచి స్కోర్‌ అందించిన రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.
టీమిండియా నిర్దేశించిన 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో బంగ్లా ఆటగాళ్లు షకీబుల్‌(66), సైఫుద్దీన్‌(51 నాటౌట్‌) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. షబ్బీర్‌(33), సౌమ్య సర్కార్‌(33), రహీమ్‌(24), లిట్టన్‌ దాస్‌(22)లు కీలక సమయాలలో వికెట్లు చేజార్చుకోవడంతో బంగ్లా ఓటమిపాలైంది. భారత బౌలర్లలో బుమ్రా(4/55), హార్దిక్‌ పాండ్యా(3/60)లు బంగ్లా పతనాన్ని శాసించారు.

అంతకుముందు టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (104; 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీకి తోడు కేఎల్‌ రాహుల్‌(77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో రాణించడంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 313 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (48; 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), ధోని(35; 33 బంతుల్లో 4 ఫోర్లు) కాస్త ఫర్వాలేదనిపిం చారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌కు 5 వికెట్లు దక్కగా, షకిబుల్, రుబెల్, సౌమ్య సర్కార్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

రోహిత్‌ నాలుగో సెంచరీ...
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి ఓవర్‌ నాలుగో బంతికే సిక్సర్‌ బాది హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఆరంభం నుంచే దూకుడు కనబర్చగా, మరోవైపు రాహుల్‌ ఆచితూచి ఆడాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తమీమ్‌ క్యాచ్‌ వదిలేయడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్‌ ఆ తర్వాత మరింత చెలరేగాడు. బౌలర్‌ ఎవరనేది చూడకుండా బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

ఈ క్రమంలో 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసిన రోహిత్‌ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. షకిబుల్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో కెరీర్‌లో 26వ, ఈ టోర్నీలో నాలుగవ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత భారీ షాట్‌ ఆడబోయి సౌమ్య సర్కార్‌ బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వెనుదిరిగాడు. దీంతో 180 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరో 15 పరుగులకే రాహుల్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. 

ఈ తరుణంలో కోహ్లి–రిషభ్‌ పంత్‌ జోడీ ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరు 42 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి(26) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆ వెంటనే హార్దిక్‌ పాండ్యా డకౌట్‌ అయ్యాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో పంత్‌ వెనుదిరిగాక, దినేశ్‌ కార్తీక్‌(8) ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో ధోని జట్టు స్కోరును 300 దాటించాడు. ఆఖరి పది ఓవర్లలో అద్భుతంగా పుంజుకుంటున్న బంగ్లా బౌలర్లు కేవలం 63 పరుగులు మాత్రమే 5 వికెట్లు పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement