ముంబై: వెస్టిండీస్‌తో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. బ్రాబోర్న్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ 98 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం నమోదు చేశాడు. సహచర ఓపెనర్ శిఖర్ ధావన్(38)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి(16) తొందరగానే పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మంచి బంతుల్ని ఆచితూచి ఆడుతూ చెడ్డ బంతుల్ని బౌండరీలుగా మలిచి సెంచరీ సాధించాడు. ఇది రోహిత్ శర్మ కెరీర్‌లో 21వ వన్డే సెంచరీ కాగా, ఓపెనర్‌గా 19వ సెంచరీ.
ఇక్కడ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఓపెనర్‌గా 19వ సెంచరీ పూర్తి చేసుకున్న క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు సాధించాడు. ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉన్నాడు. 107 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ ఓపెనర్‌గా 19వ సెంచరీ నమోదు చేశాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా 19 సెంచరీలు పూర్తి చేసుకోగా, రోహిత్ మాత‍్రం సచిన్ కంటే 8 ఇన‍్నింగ్స్‌లు ముందే ఈ ఘనత నమోదు చేశాడు. ఇక‍్కడ దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా తొలి స్థానంలో ఉన్నాడు. ఆమ్లా 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును చేరగా, ఆ తర్వాత స్థానంలో రోహిత్ ఉన్నాడు.
ఇక తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 21 సెంచరీలు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఆమ్లా(116), కోహ్లి(138), ఏబీ డివిలియర్స్(183) తర‍్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు. రోహిత్ 186 ఇన్నింగ్స్‌ల్లో 21వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2013 నుంచి చూస్తే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లి(25) తొలి స్థానంలో ఉండగా, రోహిత్(19) రెండో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment