
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు గెలుచుకొని సగర్వంగా తిరిగి వెళుతుండటం పట్ల తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సంబరంగా ఉన్నాడు. చివరి టి20లో కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్, ఈ మ్యాచ్‌లో తమ వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెప్పాడు. ‘ఈ రెండు పరిమిత ఓవర్ల ట్రోఫీలను అందుకోవడం సంతోషంగా ఉంది. సిరీస్ మొత్తం మేం చాలా దూకుడుగా ఆడాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా బృందం వెనకడుగు వేయలేదు. దాని వల్లే ఇవాళ విజేతలుగా ఇక్కడ నిలబడ్డాం’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
తొలి ఆరు ఓవర్లలో కచ్చితత్వంతో వికెట్లపైకి మాత్రమే బంతులు వేయాలనేది తమ వ్యూహమని, దీనిని సమర్థంగా అమలు చేసి బౌలర్లు మ్యాచ్ గెలిపించారని అతను అన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే మేం మరో 15 పరుగులు తక్కువగా చేశాం. మాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే చివర్లో కాస్త జోరు తగ్గింది. అయితే ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని విషయాలు నేర్చుకుంటాం’ అని రోహిత్ అభిప్రాయ పడ్డాడు. ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో గత రెండున్నర నెలలుగా అద్భుత ప్రదర్శన కనబర్చామన్న భువనేశ్వర్ కుమార్...ఈ పర్యటన తనకు మధురానుభూతిగా మిగిలిపోయిందని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment