సచిన్, ధోని, కోహ్లి దారిలో రోహిత్!
భారత క్రికెటర్ రోహిత్ శర్మ సహచరులు సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇటీవల టెస్టుల్లో పెద్దగా రాణించకపోవడంతో కెరీర్ ఊగిసలాటలో పడిన తరుణంలో ఆయన ఓ ఫ్రాంచెజీకి కో-ఓనర్గా సరికొత్త అవతారమెత్తారు. ప్రో రెజ్లింగ్ లీగ్ లో ఉత్తరప్రదేశ్ వారియర్స్ టీమ్కు సహ యజమానిగా రోహిత్ ఉండనున్నారు. ప్రో రెజ్లింగ్ లీగ్ లో ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర ఓ జట్టు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ లీగ్లోకి ఎంటరైన ప్రముఖుడు రోహితే. ఆరు నగరాలు కేంద్రంగా ఈ నెల 10 నుంచి అత్యంత అట్టహాసంగా ప్రో రెజ్లింగ్ లీగ్ ప్రారంభంకానుంది. ఈ నెల 25, 26 తేదీల్లో సెమిస్ మ్యాచులు, 27న ఫైనల్ మ్యాచ్ జరుగనున్నాయి.
ఓ జట్టుకు సహ యజమానిగా ముందుకొచ్చిన రోహిత్ శర్మ మాట్లాడుతూ 'భారత్ రెజ్లింగ్ కు ఘనమైన చరిత్ర ఉంది. యూపీ వారియర్స్ టీమ్ కు సహ యజమానిగా ఉండటం నిజంగా గర్వకారణం. భారత్ లోనే అత్యంత ప్రముఖుడైన సుశీల్కుమార్ మా జట్టులో ఉండటంతో తొలి లీగ్ లో టాప్ స్థానాన్ని సాధిస్తామని విశ్వాసముంది' అని ఆయన చెప్పారు. ఇప్పటికే క్రికెటర్లు సచిన్, ధోని, కోహ్లి ఫుట్బాల్ సూపర్ లీగ్ లో టీమ్లకు సహ యజమానులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.