‘చాలెంజ్’ చేస్తారా!
రాయల్ చాలెంజర్స్
ఓనర్:
విజయ్ మాల్యా (యూబీ గ్రూప్)
కెప్టెన్: కోహ్లి
కోచ్: వెటోరి
గత ఉత్తమ ప్రదర్శన:
రన్నరప్ (2009, 2011),
సెమీఫైనల్ (2010)
కీలక ఆటగాళ్లు:
కోహ్లి, క్రిస్ గేల్, డివిలియర్స్, యువరాజ్, రవి రాంపాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రెండుసార్లు ఫైనల్ (2009, 2011)కు చేరినా టైటిల్ మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. ఈ రెండు సీజన్లలో అద్భుతంగా ఆడినప్పటికీ.. ఒత్తిడికి తలొగ్గి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్న ఓనర్ విజయ్ మాల్యా వేలం పాటలో కొందరు కీలక ఆటగాళ్లను చేజిక్కించుకున్నారు. దీంతో రాయల్ చాలెంజర్స్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
ఇక రాయల్ చాలెంజర్స్ గత ఫిబ్రవరిలో జరిగిన వేలం పాటలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందుకు కారణం.. స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌పై విజయ్ మాల్యా కోట్లాది రూపాయలు కుమ్మరించడమే. టి20లో ఆల్‌రౌండ్ ఆటతీరుతో ఆకట్టుకునే యువరాజ్‌ను రికార్డు స్థాయిలో రూ. 14 కోట్లకు కొనుగోలు చేశారు.
ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ. 5 కోట్లకు, దక్షి ణాఫ్రికా ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్‌ను రూ. 2.4 కోట్లకు దక్కించుకున్నారు. వేలం పాటకు ముందు ముగ్గురు కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, క్రిస్‌గేల్, డివిలియర్స్‌లను రిటైన్ చేసుకుంది.
అందరి దృష్టి వారిపైనే..!
క్రిస్ గేల్... విరాట్ కోహ్లి... యువరాజ్ సింగ్... డివిలియర్స్.. ఈ నలుగురు ఆటగాళ్లపైనే రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం ప్రధానంగా భారం వేసింది. పరుగుల సునామీ సృష్టించే క్రిస్‌గేల్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉండటం... వేదిక ఏదైనా నిలకడగా రాణించే సత్తా కోహ్లి, డివిలియర్స్‌లలో ఉండటం.. తనదైన రోజున సిక్సర్ల వర్షం కురిపించి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే దమ్ము యువీలో ఉండటంతో రాయల్ చాలెంజర్స్‌ను టైటిల్ రేసులో ముందుండేలా చేస్తోంది.
సారథిగా మెప్పిస్తాడా..?
నిలకడైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్న విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఐపీఎల్-5లో కొన్ని మ్యాచ్‌లకు, ఐపీఎల్-6లో అన్ని మ్యాచ్‌లకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు సీజన్లలోనూ సారథిగా కోహ్లి మెప్పించలేకపోయాడు. అయితే ఏడాది కాలంలో కోహ్లి కెప్టెన్‌గా పరిణితి సాధించడంతో ఈసారి చాలెంజర్స్‌ను ముందుండి నడిపిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
బలాలు...
క్రిస్ గేల్ బీభత్సమైన బ్యాటింగ్... విరాట్ కోహ్లి నిలకడైన ఆట... యువరాజ్ దూకుడు... మిచెల్ స్టార్క్, వరణ్ ఆరోన్ వేగం.. ప్రత్యర్థిని బోల్తా కొట్టించే రవి రాంపాల్... మురళీధరన్, జకాటి స్పిన్ మాయాజాలం.. ఇలా రాయల్ చాలెంజర్స్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.
బలహీనతలు...
పెద్దగా ఏమీ లేవు.. ఆరు సీజన్లలో విజేతగా నిలవకపోవడంతో ఈ సారైనా ట్రోఫీ సాధించాలన్న ఒత్తిడి..
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్లు: విరాట్ కోహ్లి (కెప్టెన్), యువరాజ్ సింగ్, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, పార్థివ్ పటేల్.
విదేశీ క్రికెటర్లు: ఏబీ డివిలియర్స్, ఆల్బీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్, రవి రాంపాల్, (వెస్టిండీస్), మిచెల్ స్టార్క్, నిక్ మ్యాడిన్సన్ (ఆస్ట్రేలియా), మురళీధరన్ (శ్రీలంక).
భారత దేశవాళీ క్రికెటర్లు: హర్షల్ పటేల్, విజయ్ జోల్, అబూ నెచిమ్ అహ్మద్, సచిన్ రాణా, షాదాబ్ జకాతి, సందీప్ వారియర్, తన్మయ్ మిశ్రా, యోగేష్ టకవాలే, యజువేంద్ర సింగ్ చహల్.