
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన 2018–19 బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.2,196.36 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ (రూ.1,938.16 కోట్లు) కంటే ఇది రూ.258 కోట్లు అధికం. అయితే... ఈసారి భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కు నిధుల్లో కోత విధించారు. గత ఆర్థిక సంవత్సరంలో ‘సాయ్’కు రూ.495.73 కోట్లు ఇవ్వగా... ప్రస్తుతం రూ.429.56 కోట్లతో సరిపెట్టారు. రూ.66.17 కోట్ల మేర కోత విధించారు.
►కేంద్ర ప్రభుత్వ మానస పుత్రిక ‘ఖేలో ఇండియా’కు మాత్రం నిధులను భారీగా పెంచారు. క్రీడా ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకానికి గతేడాది రూ.350కోట్లు ఇవ్వగా... తాజా బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ.520.09 కోట్లుగా చూపారు. మొత్తం క్రీడా బడ్జెట్‌లో ఇది 23.67 శాతం కావడం గమనార్హం.
►జమ్మూకశ్మీర్‌లో క్రీడా వసతుల కల్పనకు 2017–18లో రూ.75 కోట్లు ప్రకటించగా ఈసారి రూ.50 కోట్లు మాత్రమే ఇచ్చారు.
►రానున్న కామన్‌వెల్త్, ఆసియా క్రీడల సన్నాహాల్లో ఉన్నవారికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలకు 2017–18లో రూ.302.18 కోట్లు ఇవ్వగా... తాజాగా మరో రూ.40 కోట్లు పెంచారు.
►క్రీడాకారుల ప్రోత్సాహకాలకు గతేడాది రూ.18.13 కోట్లు ప్రకటించగా... ఈసారి రూ.23 కోట్లకు పెంచారు. క్రీడల్లో మానవ వనరుల అభివృద్ధికి కేటాయింపులను సగానికి సగం తగ్గించి రూ.5 కోట్లకు పరిమితం చేశారు.
►జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్‌ఎస్‌డీఎఫ్)కి రూ.2 కోట్లను, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు రూ.కోటి కేటాయింపులను యథాతథంగా ఉంచారు.