
రూ. 600 కోట్ల టిక్కెట్ల కుంభకోణం
ఫిఫా సభ్యుడిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రియో డి జనీరో: ఈసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ సందర్భంగా టిక్కెట్ల విషయంలో భారీ కుంభకోణం జరిగినట్లు బ్రెజిల్ పోలీసులు తెలిపారు. అంతా ఇంతా కాదు... ఏకంగా రూ. 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వెల్లడించారు.
అయితే దీని వెనక ఫిఫా సభ్యుడు ఒకరు ఉన్నాడని గుర్తించి, అతడి కోసం వేట మొదలుపెట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి బ్లాక్ టిక్కెట్ల వ్యవహారం నడుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కు దాదాపు 1000 టిక్కెట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
టిక్కెట్ కనీస ధర 1365 అమెరికన్ డాలర్లు (రూ. 81,900) కాగా.. వీటిని అత్యధిక ధరకు అమ్మినట్లు గుర్తించారు. ఇక ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ రేటు 13600 అమెరికా డాలర్ల (దాదాపు రూ. 8.20 లక్షలు)కు చేరింది. అనుమానితుల ఫోన్ సంభాషణలను పోలీసులు సేకరించారు. అయితే బ్లాక్ దందా వ్యవహారం బయటపడటంపై ఫిఫా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 2022 ప్రపంచకప్ ఆతిథ్యహక్కుల్ని సొంతం చేసుకునేందుకు ఫిఫా పెద్దలకు ‘ఖతర్’ భారీగా లంచాలను ముట్టజెప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ వ్యవహారాన్ని ఫిఫా అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.